మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈడీ సమన్లు

Liquor Scam: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆ సమన్లలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ కేసు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో ఇప్పటికే విజయసాయి రెడ్డి పాల్గొని, కీలక సమాచారాన్ని వెల్లడించారు.

ఈ వివాదాస్పద మద్యం కేసు గురించి విజయసాయి రెడ్డి గతంలో రెండుసార్లు మీడియా ముందుకు వచ్చి వివరాలు పంచుకున్నారు. ముఖ్యంగా, గత ఏడాది ఏప్రిల్ 22న సామాజిక మాధ్యమం 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) ద్వారా తాను ఈ కేసులో విజిల్ బ్లోయర్‌గా వ్యవహరిస్తున్నట్టు పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ఆ సమయంలో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చను రేకెత్తించింది.

మద్యం కుంభకోణం కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మద్యం వ్యాపారం, లైసెన్సులు, ఆర్థిక లావాదేవీల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో ఈ దర్యాప్తు ప్రారంభమైంది. సిట్ బృందం ఇప్పటికే పలువురు కీలక వ్యక్తులను విచారించింది. ఇప్పుడు ఈడీ జోక్యం చేసుకోవడంతో కేసు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. విజయసాయి రెడ్డి హాజరుకు సంబంధించి వచ్చే వివరాలు ఈ కేసు దిశను నిర్ణయించనున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story