AP Liquor Scam: మద్యం కుంభకోణం కీలక నిందితుడికి 15 రోజుల గడువు.. లొంగిపోండి: ఏసీబీ కోర్టు
ఏసీబీ కోర్టు

AP Liquor Scam: వైకాపా హయాంలో జరిగిన రూ.వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు షేక్ సైఫ్ అహ్మద్ (ఏ-10) 15 రోజుల్లోగా లొంగిపోవాలని విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ఆదేశించింది. ఆలోగా అతన్ని అరెస్టు చేయవద్దని సిట్‌ను ఆదేశించలేమని కూడా స్పష్టం చేసింది. ఏసీబీ కోర్టు న్యాయాధికారి తేజోవతి బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం కుంభకోణం మూలాలు వెలికితీస్తుండటంతో సైఫ్ అహ్మద్ 2024 ఆగస్టు 9న దుబాయ్‌కు పారిపోయాడు. కేసు దర్యాప్తులో భాగంగా అతని పాత్రపై వివరాలు సేకరించిన సిట్ అధికారులు గతేడాది మే నెలలో అతనిపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. విదేశాల నుంచి వస్తే అరెస్టు తప్పదని భావించి గత్యంతరం లేని పరిస్థితుల్లో సైఫ్ అహ్మద్ జూలై నెలలో లొంగుబాటు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఏసీబీ న్యాయస్థానం లొంగిపోవాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
మద్యం డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి లంచాలు వసూలు చేసేందుకు ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డి ఏర్పాటు చేసుకున్న నెట్‌వర్క్‌లో సైఫ్ అహ్మద్ అత్యంత కీలక సభ్యుడు. కొల్లగొట్టిన సొత్తు దారి మళ్లించేందుకు టి.ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి (ఏ-9) నేతృత్వంలో ఏర్పాటైన డొల్ల కంపెనీల్లో ప్రధాన భాగస్వామి. వారిద్దరి ప్రతినిధిగా అక్రమాలకు పాల్పడ్డాడు.
ఏపీఎస్‌బీసీఎల్‌లో అప్పట్లో ప్రత్యేకాధికారిగా పనిచేసిన సత్యప్రసాద్, డేటా ఎంట్రీ ఆపరేటర్ అనూషలు అత్యంత రహస్యంగా ఉండాల్సిన మద్యం విక్రయాల డేటాను రాజ్ కెసిరెడ్డి ఆదేశాల మేరకు రియల్ టైమ్‌లో సైఫ్ అహ్మద్‌కు చేరవేసేవారు. ఏయే డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి ఎంతెంత లంచాలు వసూలు చేయాలో లెక్కలు కట్టి సైఫ్ అహ్మద్ రాజ్ కెసిరెడ్డికి పంపించేవాడు. తర్వాత దశల్లో రాజ్ కెసిరెడ్డి తన నెట్‌వర్క్ ద్వారా ఆయా డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి లంచాల సొమ్ము వసూలు చేసేవాడు. డొల్ల కంపెనీల నిర్వహణ, బోగస్ పత్రాలు, బిల్లుల సృష్టి, నగదు అక్రమ రవాణా వంటి వాటిల్లోనూ సైఫ్ అహ్మద్ కీలకంగా వ్యవహరించారు.
ఈ కేసులో మిగతా నిందితులంతా అరెస్టు కావడం, సిట్ విచారణ నుంచి తప్పించుకునే అవకాశం లేకపోవడంతో సైఫ్ అహ్మద్ లొంగుబాటు పిటిషన్ దాఖలు చేశారు.

