Liquor Scam Twist: మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం... చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు

Liquor Scam Twist: వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ స్కామ్‌లో నిందితుల అక్రమ ఆస్తుల జప్తు ప్రక్రియ వేగవంతమవుతోంది. ఈ క్రమంలో వైకాపా మాజీ ఎమ్మెల్యే, చంద్రగిరి నుంచి పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుటుంబానికి భారీ షాక్ తగిలింది.
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్‌రెడ్డి, కుమార్తె హర్షిత్‌రెడ్డి పేర్లపై ఉన్న ఆస్తులతో పాటు కేవీఎస్ ఇన్‌ఫ్రా ఎండీ చెవిరెడ్డి లక్ష్మి పేరిట ఉన్న ఆస్తులను జప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) విచారణలో చెవిరెడ్డి కుటుంబం మద్యం కుంభకోణం నుంచి వచ్చిన కమీషన్ల ద్వారా అక్రమంగా భారీ ఆస్తులు సమకూర్చుకున్నట్లు గుర్తించింది.
సిట్ గుర్తించిన వివరాల ప్రకారం... చెవిరెడ్డి కుటుంబం రూ.54.87 కోట్ల విలువైన నల్లధనాన్ని ఆస్తులుగా మార్చినట్లు తేలింది. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని భూములు, ఇతర ఆస్తులు ఈ జాబితాలో ఉన్నాయి. అధికార దుర్వినియోగం చేసి మోసపూరిత భూ లావాదేవీలు జరిపినట్లు సిట్ నిర్ధారించింది.
అవినీతి నిరోధక చట్టం, నేర చట్టాల సెక్షన్ల కింద ఈ ఆస్తులను జప్తు చేయాలని సిట్ ప్రతిపాదించగా... హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. డీజీపీకి తదుపరి చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు అందాయి. ఈ జప్తు ప్రక్రియలో భాగంగా తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లోని ఆస్తులపై అధికారులు దృష్టి పెట్టనున్నారు.
మద్యం కుంభకోణంలో ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అరెస్టు కాగా, ఆయన కుమారుడు మోహిత్‌రెడ్డి కూడా నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో ఇతర నిందితుల ఆస్తుల జప్తు కూడా కొనసాగుతోంది. రాష్ట్రంలో అవినీతిపై జీరో టాలరెన్స్ విధానంతో ముందుకు సాగుతున్న టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.

