AP SEC: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు.. అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి: ఎస్‌ఈసీ
ఎస్‌ఈసీ

AP SEC: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా నిర్వహించే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) అనిల్‌చంద్ర పునేఠా స్పష్టం చేశారు. పురపాలక, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల అధికారులందరూ ఎన్నికలకు పూర్తి సన్నద్ధతతో ఉండాలని ఆదేశించారు.
గురువారం విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎస్‌ఈసీ అధికారులతో చర్చించారు. మున్సిపల్, పంచాయతీ ఎన్నికలకు ఇప్పటివరకు చేసిన ఏర్పాట్లు, పెండింగ్‌లో ఉన్న అంశాలు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్ సమాచారం ఇస్తూ.. మొత్తం 123 మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నామని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో కోర్టు కేసులు అడ్డుగా ఉన్నాయని, వాటి పరిష్కారానికి చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న 23 కేసుల్లో నాలుగు ఇప్పటికే పరిష్కారమయ్యాయని, జనాభా ఆధారంగా డివిజన్లు, వార్డుల పునర్విభజనకు సంబంధించిన కేసులో త్వరలోనే తీర్పు రావచ్చని వివరించారు. ఓటర్ల తుది జాబితా ప్రచురణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు వంటి పనుల కోసం సిబ్బందిని సన్నద్ధం చేస్తున్నామని కూడా చెప్పారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే ప్రజంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో మొత్తం 13,359 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, వాటికి ఎన్నికల కోసం చేసిన ఏర్పాట్లు, న్యాయపరమైన సమస్యలపై వివరాలు అందించారు. 2021లో కోర్టు కేసుల కారణంగా 354 పంచాయతీలకు ఎన్నికలు జరగలేదని గుర్తు చేశారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి పురపాలకశాఖతో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితా ప్రచురణ పూర్తయిందని, పోలింగ్ కేంద్రాల గురించి త్వరలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు.
సమావేశంలో ఎన్నికల్లో బ్యాలట్ బాక్సులు వాడాలా, ఈవీఎంలు వాడాలా అనే అంశంపై కూడా చర్చ జరిగింది. జిల్లాల వారీగా ఉన్న బ్యాలట్ బాక్సులు, ఈవీఎంల వివరాలను అధికారులు సమర్పించారు. 2021లో స్థానిక ఎన్నికల కోసం ప్రభుత్వం రూ.3.50 కోట్లు కేటాయించినట్లు గుర్తు చేశారు. ఈసారి ఖర్చులపై పురపాలక, పంచాయతీరాజ్ శాఖలు వేర్వేరుగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నిర్ణయించారు.
బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందించిన తర్వాత మరోసారి సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని నిర్ణయించారు. అప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తి చేయాలని, జిల్లాల వారీగా అధికారులను సన్నద్ధం చేయాలని ఎస్‌ఈసీ స్పష్టంగా ఆదేశించారు.

