Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీపై వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న విమర్శలకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ శుక్రవారం ఘాటుగా సమాధానం ఇచ్చారు. మెగా డీఎస్సీపై జగన్ విషం కక్కడం బాధాకరమని ఆయన అన్నారు.

తన ఎక్స్ ఖాతా వేదికగా వీడియో విడుదల చేస్తూ లోకేశ్ మాట్లాడుతూ.. డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా జగన్‌కు తెలుసా? అని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌సీపీ ఐదేళ్ల పాలనలో టీచర్ పోస్టులు భర్తీ చేసింది సున్నా అని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకం డీఎస్సీపైనే చేశారని వివరించారు. ఈ డీఎస్సీ ద్వారా 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశామని ఆయన తెలిపారు.

డీఎస్సీ ప్రక్రియను అడ్డుకునేందుకు వైఎస్‌ఆర్‌సీపీ నేతలు సుమారు 300 కేసులు వేశారని లోకేశ్ ఆరోపించారు. ఆ కేసుల విచారణ సందర్భంగా కోర్టులు ప్రభుత్వాన్ని తప్పు పట్టలేదని పేర్కొన్నారు. డీఎస్సీపై వచ్చిన ప్రతి ఆరోపణకు అధికారులు ఆధారాలతో సహా సమాధానం ఇచ్చారని చెప్పారు. టీచర్లపై ఒత్తిళ్లు, దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుని 53 రోజులు జైలులో పెట్టారని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లుగా సాగిన చట్టపరమైన ప్రక్రియ పూర్తయిందని, చంద్రబాబుకు క్లీన్ చిట్ వచ్చిందని తెలిపారు. త్వరలోనే కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు.

Next Story