హోటల్ పరిశ్రమ ఆందోళనలో

LPG Gas Shortage: వంటగ్యాస్ (ఎల్‌పీజీ) తీవ్ర కొరతతో దేశవ్యాప్తంగా చిన్న, మధ్యస్థ హోటళ్లు మూతపడే పరిస్థితి నెలకొంది. పెట్రోలియం కంపెనీలు కమర్షియల్ సిలిండర్ల సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయాలని డీలర్లకు ఆదేశాలు జారీ చేయడంతో తెలుగు రాష్ట్రాల హోటల్ యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ముంబయి, ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో పలు హోటళ్లు తాత్కాలికంగా మూసివేసినట్లు సమాచారం. ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తీవ్రంగా కనిపిస్తోంది.

విశాఖపట్నంలో కమర్షియల్ సిలిండర్ల కొరత తీవ్రమైందని విశాఖ హోటల్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలకృష్ణ తెలిపారు. రేపటి నుంచి సరఫరా మరింత తగ్గే అవకాశం ఉందని, ఇప్పటికే బ్లాక్ మార్కెట్ నడుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే హోటల్ నిర్వహణ కష్టమవుతుందన్నారు. ఇప్పటికే కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశామని, గ్యాస్ కొరత లేకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని మోదీలకు విజ్ఞప్తి చేశారు.

తెలంగాణలో కూడా పరిస్థితి ఇదే. కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో వ్యాపారానికి గండి పడిందని తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వాలు ప్రత్యామ్నాయాలు చూపకపోతే రాష్ట్రవ్యాప్తంగా హోటళ్ల బంద్‌కు దిగాలని ఆలోచిస్తున్నామని తెలిపారు. సికింద్రాబాద్‌లో అత్యవసర సమావేశం నిర్వహించిన అసోసియేషన్, పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల వల్ల ఎల్‌పీజీ దిగుమతులు తగ్గిపోవడమే ఇందుకు కారణమని ఆందోళన వ్యక్తం చేసింది.

హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని హాస్టళ్ల అసోసియేషన్ కూడా గ్యాస్ కొరతను ఎదుర్కొంటోంది. పరిస్థితి మెరుగుపడే వరకు వినియోగాన్ని ఆచితూచి చేయాలని సూచించింది. సెల్ఫ్ కుకింగ్ సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. టీ, కాఫీలు తాత్కాలికంగా నిలిపేయాలి; చపాతీ, దోసె, పూరీ వంటి అధిక గ్యాస్ వినియోగం అవసరమయ్యే బ్రేక్‌ఫాస్ట్‌లు తగ్గించాలి; కొన్ని కూరలు, అదనపు వంటకాలను తాత్కాలికంగా మానేయాలని హాస్టల్ యజమానులకు సూచనలు జారీ చేసింది.

పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ దిగుమతులు తగ్గడంతో దేశవ్యాప్తంగా ఈ సమస్య తలెత్తింది. కేంద్ర ప్రభుత్వం గృహావసరాలకు ప్రాధాన్యత ఇస్తూ కమర్షియల్ సరఫరాను నియంత్రిస్తోంది. హోటల్ యజమానులు ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోవాలని, ప్రత్యామ్నాయ ఇంధనాలు లేదా సరఫరా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే హాస్పిటాలిటీ సెక్టార్‌పై తీవ్ర ప్రభావం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story