Madhav Demands Probe: మాధవ్: వైకాపా హయాంలో ఇళ్ల పట్టాలపై విచారణ జరగాలి
ఇళ్ల పట్టాలపై విచారణ జరగాలి

Madhav Demands Probe: వైకాపా ప్రభుత్వ హయాంలో పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల పట్టాల్లో నిజమైనవి ఎన్ని, నకిలీవి ఎన్ని అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విచారణ జరపాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు జగన్ ప్రభుత్వం లక్షలాది మంది పేదలకు స్థలం చూపించకుండానే పట్టాలు ఇచ్చి తీవ్రంగా మోసం చేసిందని ఆరోపించారు.
భాజపా నిర్వహిస్తున్న ‘జనతా వారధి’ కార్యక్రమంలో ఈ విషయంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని, రాష్ట్రవ్యాప్తంగా భాజపా నేతలు కలెక్టరేట్ల వద్ద వినతిపత్రాలు అందజేస్తున్నారని మాధవ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
‘‘2024 ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో వైకాపా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షలకు పైగా పట్టాలు పంపిణీ చేయాలని పిలుపునిచ్చింది. దీంతో ప్రజాప్రతినిధులు, వైకాపా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని లక్షలాది పట్టాలు పంపిణీ చేశారు. కానీ ఈ పట్టాలన్నీ చిత్తుకాగితాల్లా మిగిలాయి. పేదలకు ఇల్లు ఇస్తామని ఆశ చూపి, పట్టా కాగితం చేతిలో పెట్టి స్థలం చూపించలేదు. ఇది స్పష్టమైన ఎన్నికల మోసం కాదా?’’ అని మాధవ్ ప్రశ్నించారు.
వైకాపా ప్రభుత్వ అక్రమాలపై ఉదాసీనత చూపకూడదని, పేదలకు ఇచ్చిన పట్టాల్లో భూమి లేనివి ఎన్నో గుర్తించాలని ఆయన అన్నారు. నకిలీ పట్టాలని తేలితే ఎన్నికల మోసం కింద కేసులు నమోదు చేయాలి. ప్రజల్ని మోసం చేసిన నాయకులపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు.

