Minister Nara Lokesh: మంగళగిరి అభివృద్ధి ఆగలేదు: బడ్జెట్ కొరత ఉన్నా పనులు కొనసాగుతున్నాయి - లోకేశ్
లోకేశ్

Minister Nara Lokesh: రాష్ట్ర బడ్జెట్‌లో కొరత ఉన్నప్పటికీ మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతున్నాయని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ నిధులతో సమస్య ఉంటే సీఎస్‌ఆర్ ఫండ్స్, ఇతర ప్రత్యామ్నాయ వనరులను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు.
మంగళగిరి నియోజకవర్గంలో రెండవ రోజు ‘మన ఇల్లు.. మన లోకేశ్’ కార్యక్రమం కింద పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, ఎక్కడా ఎలాంటి ఆరోపణలు రాకుండా పూర్తి పారదర్శకంగా పట్టాలు అందించామని తెలిపారు. రెండు రోజుల్లోనే సుమారు 3,000 మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు.
కొండవాలు ప్రాంతాలు, అటవీ భూములు, దేవాలయ భూముల్లో దశాబ్దాలుగా నివసిస్తున్న పేద ప్రజలు ఇప్పుడు చట్టబద్ధమైన ఇళ్ల పట్టాలు పొందడం గర్వకారణమని లోకేశ్ వ్యాఖ్యానించారు. లబ్ధిదారులందరికీ నూతన వస్త్రాలు, పసుపు కుంకుమలతో పట్టాలు అందించారు.
అన్ని సమస్యలకు పరిష్కారం త్వరలో:
ఇంటి పట్టాలతో పాటు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, 100 పడకల ఆసుపత్రి, తాగునీటి సమస్యలు తదితర అన్ని అంశాలపై రెండేళ్లలోనే స్థిరమైన పరిష్కారం చూపిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మంగళగిరి ప్రజలు తనను ఓడించినా కసితో కాకుండా మరింత ఉత్సాహంగా పని చేశానని చెప్పారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడే 29 సంక్షేమ పథకాలను సొంత నిధులతో అమలు చేశానని, అధికారంలోకి వచ్చాక ఇంకా ఎంతో చేస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు లోకేశ్. దేశవ్యాప్తంగా నిడమర్రు పాఠశాల గురించి చర్చ జరగడం తనకు గర్వంగా ఉందని కూడా పేర్కొన్నారు.

