గ్రేహౌండ్స్‌లు సోదాలు.. 27 మంది అరెస్ట్

Maoist Movement in Vijayawada: మావోయిస్టు అగ్రనేత మద్వి హిడ్మా ఎన్‌కౌంటర్ సమయంలో విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. కానూరు కొత్త ఆటోనగర్‌లో గ్రేహౌండ్స్, ఆక్టోపస్ బృందాలు, జిల్లా పోలీసుల తీవ్ర తనిఖీలు కొనసాగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన మావోయిస్టులు ఆటోనగర్‌లోని ఒక భవనాన్ని షెల్టర్ జోన్‌గా మార్చుకున్నట్లు సమాచారం. ఈ భవనంలో మొత్తం 27 మంది మావోయిస్టులు దాగి ఉన్నట్లు, భారీగా ఆయుధాలు డంప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో పోలీసులు 27 మందిని అదుపులోకి తీసుకున్నారు.

కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో ఆక్టోపస్, గ్రేహౌండ్స్ బలగాలు మావోయిస్టులను అరెస్ట్ చేశాయి. వీరిలో 21 మంది మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నట్లు తెలుస్తోంది. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో దొరికిన డైరీలో ఈ మావోయిస్టుల సమాచారం లభించింది. దాని ఆధారంగానే పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ షెల్టర్‌ను ఒక మహిళ అగ్రనేతగా నడుపుతున్నట్లు సమాచారం. అందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశానికి తరలించారు.

కేంద్ర ప్రభుత్వం 'ఆపరేషన్ కగార్' పేరిట అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్‌లు చేపట్టిన నేపథ్యంలో మావోయిస్టులు అడవులను వదిలి నగరాల్లోకి ప్రవేశిస్తున్నారని పోలీసులు అంచనా. ఈ క్రమంలో విజయవాడ వంటి పట్టణాల్లో కూడా మావోయిస్టుల కదలికలు పెరిగాయి.

ఇక, ఈరోజు (మంగళవారం) ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య తీవ్ర ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ అగ్రనేత మద్వి హిడ్మా మృతి చెందాడు. హిడ్మాతో పాటు మరో ఐదుగురు మొత్తం ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు. ఈ విషయాన్ని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ధృవీకరించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story