రిపోర్టు సంచలనం!

Meta Watworth Project: ప్రపంచంలోనే అతిపెద్ద సముద్రగర్భ కేబుల్ నెట్‌వర్క్‌గా పేరొందిన ‘మెటా వాటర్‌వర్త్ ప్రాజెక్ట్’ను భారత్‌తో అనుసంధానం చేసేందుకు మెటా కంపెనీ కీలక అడుగులు వేస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం మన దేశంలో ముంబయి, విశాఖపట్నం నగరాలను ల్యాండింగ్ పాయింట్లుగా ఎంచుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని కంపెనీ వర్గాలను ఉటంకిస్తూ ఎకనామిక్ టైమ్స్ పత్రిక ఒక కథనంలో వెల్లడించింది.

ఈ మహత్తర ప్రాజెక్ట్ కోసం భారత్‌లో ల్యాండింగ్ భాగస్వామిగా సైఫీ టెక్నాలజీస్‌ను మెటా ఎంపిక చేసుకుందని ఆ కథనం తెలిపింది. దీనికి సంబంధించి 5 మిలియన్ డాలర్ల ఒప్పందం జరిగినట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై మెటా లేదా సైఫీ సంస్థలు ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఇదే తరహాలో గూగుల్ కూడా తన 400 మిలియన్ డాలర్ల విలువైన బ్లూ-రామన్ సముద్రగర్భ కేబుల్ ప్రాజెక్ట్ కోసం సైఫీతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.

దక్షిణాసియా ప్రాంతంలో ఇంటర్నెట్ డేటా డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, గత మూడు సంవత్సరాలుగా భారత్‌లో సముద్రగర్భ కేబుల్ రంగం పట్ల ఆసక్తి పెరిగింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ వంటి దేశీయ టెలికాం దిగ్గజాలు ఇప్పటికే ఈ రంగంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నాయి. ఇప్పుడు మెటా, గూగుల్ లాంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ రంగంలోకి అడుగుపెడుతున్నాయి. వచ్చే 5-10 సంవత్సరాల్లో మెటా కేబుల్ సిస్టమ్ భారత్‌లో 10 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు ఆకర్షించే అవకాశం ఉందని కాలిఫోర్నియాకు చెందిన ఓపెన్ కేబుల్స్ సంస్థ వ్యవస్థాపకుడు సునీల్ తగారే అంచనా వేశారు.

వాటర్‌వర్త్ ప్రాజెక్ట్ అంటే ఏమిటి..?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సమయంలో ఇరు దేశాల నేతలు ఈ ప్రాజెక్ట్‌ను సంయుక్తంగా ప్రకటించారు. ఈ వాటర్‌వర్త్ ప్రాజెక్ట్ కింద, ప్రపంచంలోని ఐదు ప్రధాన ఖండాలను కలిపేలా 50,000 కిలోమీటర్లకు పైగా పొడవున్న కేబుల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇది భూమి చుట్టుకొలత (40,075 కి.మీ) కంటే ఎక్కువే. నౌకల లంగర్లు, ఇతర ప్రమాదాల నుంచి రక్షణ కల్పించేందుకు అధునాతన సాంకేతికతతో 7,000 మీటర్ల లోతున ఈ కేబుల్‌ను వేస్తున్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత సమర్థవంతమైన, అధునాతన సాంకేతికతతో నిర్మించబడుతున్న ఈ సముద్రగర్భ కేబుల్ ద్వారా భారత్, అమెరికా సహా ఇతర ప్రాంతాలను అనుసంధానం చేస్తామని మెటా ప్రతినిధులు గతంలో ప్రకటించారు. ఇంటర్నెట్ కార్యకలాపాలకు సముద్రగర్భ కేబుళ్లు చాలా కీలకం. దేశాల మధ్య అనుసంధానానికి ఇవి ప్రధాన మార్గాలు. స్థానిక టెలికాం సంస్థలు ఈ కేబుళ్లకు కనెక్ట్ అయి తమ వినియోగదారులకు ఇంటర్నెట్ సేవలను అందిస్తాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story