Minister Kinjarapu Atchannaidu: సెప్టెంబర్ 9ను తెలుగు జాతి చరిత్రలో ఎన్నటికీ మరచిపోలేని చీకటి రోజుగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అభివర్ణించారు. మూడేళ్ల క్రితం అప్పటి టీడీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అక్రమ కేసులతో నిర్బంధించి జైలుకు పంపడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆయన తీవ్రంగా విమర్శించారు.

2023 సెప్టెంబర్ 9న నంద్యాలలో పార్టీ కార్యక్రమం కోసం ఉన్న చంద్రబాబు నాయుడిని సీఐడీ అధికారులు అర్ధరాత్రి బస్సు తలుపులు బాదుతూ అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. 53 రోజుల పాటు జైలు జీవితం గడిపిన ఆయనకు తర్వాత హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాజకీయ కక్షసాధింపుతో పన్నిన ఈ కుట్రలే చివరకు వైసీపీ పతనానికి నాంది పలికాయని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

అయితే చంద్రబాబును అక్రమంగా జైలుకు పంపినా, ప్రజల్లో ఆయనపై ఉన్న విశ్వాసాన్ని ఎవరూ దెబ్బతీయలేకపోయారని మంత్రి స్పష్టం చేశారు. ఆ కష్టకాలంలో చంద్రబాబుకు అండగా యావత్ తెలుగు జాతి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు నిలిచారని గుర్తు చేశారు. ఎన్ని రాజకీయ కక్షలు, నిర్బంధాలు ఎదురైనా చంద్రబాబు ప్రజల పక్షాన నిలిచి పోరాడారని ఆయన అన్నారు.

నేడు చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ను తిరిగి అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం చంద్రబాబు చేసిన సేవలు, ఎదుర్కొన్న పోరాటాలు, ప్రజల కోసం అందించిన కృషి తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని ఆయన అన్నారు. ప్రజల విశ్వాసమే చంద్రబాబు బలమని, ఆ విశ్వాసంతోనే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఇతర మంత్రులు, నేతలు కూడా సెప్టెంబర్ 9ను ‘బ్లాక్ డే’గా పాటిస్తూ, అక్రమ అరెస్ట్ వైసీపీ అరాచక పాలనకు అంతం తెచ్చిందని వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికల్లో కూటమి 164 స్థానాల్లో గెలిచి చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ప్రజలు తమ తీర్పు ఇచ్చారని వారు గుర్తు చేశారు.

Next Story