Minister Nadendla Manohar: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం.. 6,330 ఎకరాల భూములు వేలానికి సిద్ధం
వేలానికి సిద్ధం

Minister Nadendla Manohar: అగ్రిగోల్డ్ ఆస్తుల్లో 6,330 ఎకరాల భూములను వేలం ద్వారా విక్రయించి, ఆ డబ్బులు బాధితులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ బుధవారం వెల్లడించారు.
అగ్రిగోల్డ్‌కు దేశవ్యాప్తంగా 23,430 ఎకరాలు ఉండగా, అందులో ఆంధ్రప్రదేశ్‌లోనే 20,450 ఎకరాలు ఉన్నట్లు గుర్తించామని ఆయన చెప్పారు. వీటిలో 14,304 ఎకరాలను సీఐడీ ప్రభుత్వానికి అప్పగించినట్లు తెలిపారు. ఈ నెల 11న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో జరిగే సమావేశంలో వేలానికి సంబంధించిన విధివిధానాలు ఖరారు చేస్తామని, సెప్టెంబరు 15 నుంచి విడతల వారీగా భూముల వేలం ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రి పేర్కొన్నారు.
అగ్రిగోల్డ్ సమస్యపై ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉప సంఘం బుధవారం సచివాలయంలో సమావేశమైంది. మంత్రులు అనిత, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్ ఈ సమావేశంలో పాల్గొనగా, మంత్రి పయ్యావుల కేశవ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. అనంతరం మంత్రి మనోహర్ విలేకరులతో మాట్లాడారు.
‘అగ్రిగోల్డ్‌లో ఏజెంట్ల ద్వారా రూ.6,380 కోట్లు డిపాజిట్లుగా సేకరించారు. ఇందులో మన రాష్ట్రానికి చెందినవే రూ.3,944 కోట్లు ఉన్నాయి. 18,57,290 ప్లాట్లు ఉన్నట్లు చూపించి డిపాజిట్లు సేకరించారు. కానీ ఆడిట్‌లో కేవలం 5,76,589 ప్లాట్లే ఉన్నాయి. నిర్దేశిత గడువులోపు బాధితులకు న్యాయం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రతి అంశం ప్రజలకు తెలిసేలా ప్రత్యేక వెబ్‌సైట్, డ్యాష్‌బోర్డు అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. అగ్రిగోల్డ్ భూముల్లో పెంచిన ఎర్రచందనం వేలానికి నోడల్ అధికారిని నియమించాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ను కోరాలని నిర్ణయించాం’ అని మనోహర్ తెలిపారు.
తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో ఏజెంట్లు, బాధితులు బాండ్లు అందజేసేలా ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తామని కూడా ఆయన చెప్పారు. 2015 మార్చి 1 నాటికి ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నవాళ్లు ఆ డాక్యుమెంట్లు సీఐడీ రీజనల్ కార్యాలయంలో అందజేస్తే, వాటిని 22ఎ జాబితా నుంచి తొలగించి ఫ్రీహోల్డ్ చేసేలా చూస్తామన్నారు. అగ్రిగోల్డ్ కేసుల కోసం ప్రత్యేక కోర్టు సిద్ధం చేశామని, ఆగస్టు 15 నాటికి న్యాయాధికారిని నియమించాలని హైకోర్టు సీజేకి విజ్ఞప్తి చేస్తున్నామని మంత్రి తెలిపారు.
అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్ల సంఘం గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ, అగ్రిగోల్డ్ బాధితులకు ఆరు నెలల్లో డబ్బులు ఇప్పిస్తామని ముఖ్యమంత్రి మాట ఇచ్చి దాన్ని ఆచరణలో పెడుతున్నారని, ఒకట్రెండు నెలలు ఆలస్యమైనా అమలు చేస్తారని నమ్ముతున్నట్లు తెలిపారు. ఆయన అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఇ.వి.నాయుడు, ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు, ఉప ప్రధానకార్యదర్శి చంద్రశేఖర్ తదితరులతో మంత్రివర్గ ఉప సంఘాన్ని కలిసి వినతిపత్రం అందజేశారు.

