Minister Nara Lokesh: నిబద్ధతే ప్రమాణం.. 150 మంది కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు
నామినేటెడ్ పదవులు

Minister Nara Lokesh: పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన నాయకులు, కార్యకర్తలను ఎవరి సిఫారసు అవసరం లేకుండా నేరుగా నామినేటెడ్ పదవులకు ఎంపిక చేస్తామని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. 2024 ఎన్నికలకు ముందు నుంచి పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఆరు కార్యక్రమాల్లో పనితీరును ప్రామాణికంగా తీసుకుని ఈ ఎంపిక చేస్తామన్నారు.
మొత్తం ఆరు కార్యక్రమాల్లోనూ అత్యుత్తమ పనితీరు కనబరిచి అవార్డులు అందుకున్నవారికి తొలి ప్రాధాన్యం ఇస్తామని, ఆ తర్వాత ఐదు, నాలుగు కార్యక్రమాల్లో అవార్డులు సాధించినవారికి అవకాశం కల్పిస్తామని ఆయన తెలిపారు. మంగళవారం ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ.. ‘పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్లో నిబద్ధతతో పాల్గొన్నవారిని గుర్తించి.. వారి స్థాయి, సామర్థ్యం బట్టి రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేటెడ్ పదవుల్లో నియమిస్తాం. ఈ ప్రతిపాదనకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఆమోదం తెలిపారు. పదవుల కోసం సుమారు 150 మందిని ప్రాథమికంగా గుర్తించాం’ అని వివరించారు.
కార్యకర్తలకు మొదటి నుంచీ తెదేపా పెద్దపీట వేస్తోందని, అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని లోకేశ్ అన్నారు. వారి సంక్షేమానికి ఇప్పటి వరకు రూ.200 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఎమ్మెల్యేలు నిరంతరం కార్యకర్తలతో మాట్లాడుతూ, వారికి అందుబాటులో ఉండాలని సూచిస్తున్నామని, మాట విననివారిని గట్టిగా హెచ్చరిస్తున్నామని చెప్పారు. కూటమి పార్టీలు విస్తృత సమన్వయంలో పనిచేస్తున్నాయని, చిన్న సమస్యలున్నా సర్దుబాటు చేసుకుంటూ ముందుకెళ్తామన్నారు.
పార్టీ స్థాపించి నాలుగు దశాబ్దాలు దాటినా ఇంకా అన్ని జిల్లాల్లో కార్యాలయాలు లేవని, ప్రస్తుతం వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టామని లోకేశ్ వెల్లడించారు. భవిష్యత్తులో నియోజకవర్గ స్థాయిలోనూ పార్టీ కార్యాలయాలు నిర్మిస్తామన్నారు. ముఖ్యమంత్రి, తాను కార్యకర్తలతో నిర్వహిస్తున్న సమావేశాలు వచ్చే డిసెంబరు నాటికి 175 నియోజకవర్గాల్లోనూ పూర్తవుతాయని, తర్వాత రెండో దఫా సమావేశాలు ప్రారంభిస్తామని తెలిపారు. ఇటీవల నిర్వహించిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని 40 రోజుల్లో పూర్తి చేశామని, భవిష్యత్తులో ఇంకా తక్కువ రోజుల్లోనే ఇంటింటికీ చేరాలన్న లక్ష్యంతో కార్యక్రమాలు రూపొందిస్తామని ఆయన చెప్పారు.

