Minister Nara Lokesh: గుండెపోటుతో హఠాత్తుగా మరణించిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పార్థివ దేహాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సందర్శించి నివాళులర్పించారు. ఏలూరులోని నాని నివాసం వద్ద ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అకాల మరణం వివరాలు అడిగి తెలుసుకున్నారు.

మీడియాతో మాట్లాడుతూ మంత్రి లోకేశ్ “ఆళ్ల నాని మృతి చాలా బాధాకరం. రాష్ట్రం మంచి వ్యక్తిని కోల్పోయింది. రాజకీయాల్లో ఆయన ఎప్పుడూ హుందాగా వ్యవహరించేవారు. వ్యక్తిగత విమర్శలకు తావివ్వకుండా సమస్యలపైనే పోరాడేవారు. టీడీపీ భావజాలానికి ఆకర్షితులై పార్టీలో చేరిన విషయం తెలిసింది” అని అన్నారు.

“నాని డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉండేవాడిని. శాసన మండలిలో ఆయన్ని కలిశాను. వ్యక్తిగత విమర్శలు వద్దని చెప్పేవారు. మండలిలో హుందాగా మాట్లాడేవారు. ఆయన కుటుంబానికి పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా, వ్యక్తిగతంగా అండగా ఉంటాం. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తాం” అని హామీ ఇచ్చారు.

మంత్రి లోకేశ్‌తో పాటు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, మంత్రులు కొలుసు పార్థసారథి, నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు, రోషన్ కుమార్ తదితర కూటమి నాయకులు కూడా ఆళ్ల నాని భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.

Next Story