Minister Nimmala Rama Naidu: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శుక్రవారం వాహనాల వాడకం తగ్గించాలనే ప్రధాని నరేంద్ర మోదీ పిలుపును ఆచరణలో పెట్టారు. తన కాన్వాయ్‌ను పక్కన పెట్టి సైకిల్‌పై సుమారు 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ప్రజలకు ఆదర్శం చాటారు.

విజయవాడలోని తన క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరిన మంత్రి, బందరు రోడ్డు చివరి దుర్గగుడి ఫ్లైఓవర్ మీదుగా ప్రకాశం బ్యారేజి, కొండవీటి వాగు ఎత్తిపోతల రహదారి, కృష్ణా కరకట్ట మార్గంలో ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.

ప్రయాణంలో భాగంగా పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లింపు, పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, సైకిల్‌పైనే తిరిగి వెళ్లారు.

ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, “దేశ భవిష్యత్తు కోసం ఇంధన పొదుపు చేయాలని ప్రధాని ఇచ్చిన పిలుపును వైఎస్‌ఆర్‌సీపీ నేతలు హేళన చేయడం బాధాకరం” అని వ్యాఖ్యానించారు.

పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలనే అంశంపై మంత్రిమండలి సమావేశంలో చర్చించిన నేపథ్యంలో ఈ చర్య తీసుకోవడం గమనార్హం.

Next Story