Minister Anam Ramanarayana Reddy: ప్రతి నియోజకవర్గంలో 25కి పైగా ఆలయాల నిర్మాణం..కామన్ గుడ్ ఫండ్ కింద 706 ఆలయాలకు అనుమతి: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
కామన్ గుడ్ ఫండ్ కింద 706 ఆలయాలకు అనుమతి: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

Minister Anam Ramanarayana Reddy: కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) కింద రాష్ట్రంలోని 706 ఆలయాల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశామని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సహకారంతో ప్రతి నియోజకవర్గంలో 25 నుంచి 35 ఆలయాలు నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
రూ.832 కోట్లతో ఆలయాల అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. జిల్లాల నుంచి నివేదికలు అందిన వెంటనే మరిన్ని ఆలయాలకు నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.
ధూపదీప నైవేద్య పథకం కింద 6,170 ఆలయాలకు నెలకు రూ.10 వేల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నామని ఆనం రామనారాయణ రెడ్డి వివరించారు. ఈ మొత్తం రూ.74.04 కోట్లు నేరుగా అర్చకుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు.
ఇంకా, రాష్ట్రవ్యాప్తంగా 679 భజన మందిరాల నిర్మాణానికి రూ.113.25 కోట్లు విడుదల చేశామని, కొత్తగా 5 వేల భజన మందిరాల నిర్మాణం కోసం రూ.750 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్రంలోని 956 ఆలయాలకు ధర్మకర్తల మండళ్లను నియమించినట్లు కూడా వెల్లడించారు.
ఈ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో ఆధ్యాత్మిక వారసత్వాన్ని భద్రపరచడంతో పాటు, ఆలయాలు సామాజిక కేంద్రాలుగా మార్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.

