MP Lavu Srikrishna Devaraya: మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులకు టీడీపీ సంపూర్ణ మద్దతు..543 సీట్లు కావా.. 816 సీట్లు కావా? ఏదైనా సరే.. మాకు అభ్యంతరం లేదు!
543 సీట్లు కావా.. 816 సీట్లు కావా? ఏదైనా సరే.. మాకు అభ్యంతరం లేదు!

MP Lavu Srikrishna Devaraya: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలంటే తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ సీట్ల ప్రకారం అమలు చేసినా లేదా ప్రతిపాదిత 816 సీట్లతో అమలు చేసినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన ప్రకటించారు.
శుక్రవారం లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, డీలిమిటేషన్ బిల్లులపై మాట్లాడుతూ లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ విషయం వెల్లడించారు. “మేము మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులకు పూర్తి మద్దతు పలుకుతున్నాం. దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మేము ఈ బిల్లులకు మద్దతు ఇస్తామా? డీలిమిటేషన్ వల్ల మా సీట్ల సంఖ్య తగ్గుతుందా? అని మిగతా పార్టీల నాయకులు, మీడియా ప్రతినిధులు అడుగుతున్నారు. ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చి పార్లమెంటు రికార్డుల్లో నమోదు చేయాలనుకుంటున్నాం” అని ఆయన అన్నారు.
నిన్నటి నుంచి ఎంతో మంది మహిళలు పార్లమెంటు గ్యాలరీల్లోకి వచ్చి ఈ బిల్లుల చర్చలను ఆసక్తిగా వీక్షిస్తున్నారని, బిల్లు పాస్ అయితే చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుందని వారు ఆశిస్తున్నారని ఆయన తెలిపారు. “ఇప్పుడు మహిళలు తమకోసం తామే విధానాలు రూపొందించుకునే స్థితి వచ్చింది. దీన్ని మేము హర్షిస్తున్నాం” అని ఆయన స్పష్టం చేశారు.
ప్రతి రాష్ట్రంలో 50 శాతం సీట్లు పెంచుతామని హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారని గుర్తు చేస్తూ, ప్రస్తుతం లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ ప్రాతినిధ్యం 4.60 శాతం ఉందని, సీట్లు పెంచిన తర్వాత అది 4.66 శాతానికి పెరుగుతుందని లావు శ్రీకృష్ణదేవరాయలు వివరించారు. అందువల్ల ఏపీ ప్రాతినిధ్యం తగ్గదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
చాలా పార్టీలు లోక్‌సభ సీట్ల పెంపుకు 1971 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని కోరుతున్నాయని, 1976లో రాజ్యాంగ సవరణ ద్వారా 543 సీట్ల వద్దనే స్తంభింపజేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతిపక్షాలు కోరుతున్నదే కేంద్రం చేస్తున్నప్పటికీ కొందరు రాజకీయ కారణాలతో వ్యతిరేకిస్తున్నారని ఆయన విమర్శించారు. 2025 మార్చి 25న చెన్నైలో డీఎంకే నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్, సీపీఎం, బీఆర్‌ఎస్, ఆప్, టీఎంసీలు 1971 జనాభా ప్రకారం రాష్ట్రాల ప్రాతినిధ్యం ఉంచాలని తీర్మానం చేశాయని, ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడం లేదని ప్రశ్నించారు.
కొత్త జనాభా లెక్కలను నియోజకవర్గాల పునర్విభజనకు ప్రాతిపదికగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన సూచించారు.
ఈ బిల్లులు మహిళల చిరకాల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ముందడుగు వేస్తాయని టీడీపీ నాయకులు భావిస్తున్నారు. లోక్‌సభ చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో టీడీపీ వైఖరి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

