Municipal Election Results: మున్సిపల్ ఎన్నికల్లో వైకాపాకు మరో భారీ ఎదురుదెబ్బ.. సార్వత్రిక ఎన్నికల కంటే ఘోర పరాజయం
ఘోర పరాజయం

Municipal Election Results: సార్వత్రిక ఎన్నికల్లో మునిగిన వైకాపా నావ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో మరింత లోతుకు కూరుకుపోయింది. వైకాపాకు కంచుకోటలుగా, తమకు బాగా బలముందని ఆ పార్టీ నేతలు చెప్పుకునే నాలుగు ఉమ్మడి రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనూ ప్రభావం చూపలేకపోయింది. ఆ పార్టీ బలంగా ఉందనుకునే ఈ ఆరు ఉమ్మడి జిల్లాల్లో 17 మున్సిపాలిటీలు పోలింగ్‌కు ముందే కూటమికి ఏకగ్రీవమయ్యాయి.
కూటమి పార్టీల్లో లుకలుకలు, అనైక్యత, సమన్వయం కుదరని అనంతపురం కార్పొరేషన్, నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు మున్సిపాలిటీని మాత్రమే వైకాపా కైవసం చేసుకోగలిగింది. అర్ధరాత్రి 12 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం నాయుడుపేటలో ఛైర్మన్ స్థానంతో పాటు 13 వార్డులు గెలుచుకోగలిగింది. సాలూరులో గట్టిపోటీ ఇస్తోంది. అనంతపురం మేయర్ ఎన్నికల్లో స్వల్ప ఆధిక్యంలో ఉంది. బేతంచర్లలో వైకాపా ఛైర్మన్ అభ్యర్థి దూదేకుల దస్తగిరి 1492 ఓట్లతో విజయం సాధించారు. డోన్‌లో కూడా వైకాపా కొంతమేర ప్రభావం చూపగలిగింది.
కడప కోట కూలింది
వైకాపా అధ్యక్షుడు జగన్ సొంత ఇలాకాలోనూ ఆ పార్టీ దాదాపు బోర్డు తిప్పేసింది. వైఎస్సార్ కడప జిల్లాలో కడప కార్పొరేషన్ సహా మిగిలిన మున్సిపాలిటీల్లోనూ గట్టిపోటీ కూడా ఇవ్వలేని దుస్థితిలోకి వైకాపా వెళ్లిపోయింది. జిల్లాలోని 279 మున్సిపల్ వార్డుల్లో వైకాపాకు దక్కింది కేవలం 7 మాత్రమే. పోలింగ్‌కు ముందే వైఎస్సార్ కడప జిల్లాలో ఆరు మున్సిపాలిటీలు కూటమికి ఏకగ్రీవమయ్యాయి. నగరపాలక సంస్థల పరిధిలో వైకాపా తుడిచిపెట్టుకుపోయింది.
జనంతో నాకేంటి అన్నట్లుగా జగన్
2024 ఎన్నికల్లో ఓడించారనే కక్షనో, మరేంటో గానీ రాష్ట్ర ప్రజల పట్ల జగన్ ఏ మాత్రం బాధ్యతగా వ్యవహరించడం లేదు. ఓడిన తర్వాత బెంగళూరులోని ప్యాలెస్‌కే పరిమితమై వారానికోసారి చుట్టపుచూపుగా వచ్చి వెళుతున్నారు. ఆ అహంకారధోరణే ఇప్పుడు కొంప ముంచిందని నాయకులు వాపోతున్నారు.
ఆ 11 చోట్లా ప్రభావం లేకుండా
2024 సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా 11 స్థానాల్లో గెలిచింది. ఆయా నియోజకవర్గాల్లో ఇప్పుడు ఎన్నికలు జరిగిన మున్సిపాలిటీల్లోనూ ఆ పార్టీ ప్రభావం చూపలేకపోయింది. అప్పుడు దర్శిలో వైకాపా గెలిచినా ఇప్పుడు దర్శి మున్సిపాలిటీలో వైకాపా జీరో అయింది. జగన్ ఎమ్మెల్యేగా ఉన్న పులివెందులతో పాటు, వైకాపా హయాంలో నంబర్-2గా చక్రం తిప్పిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు, అధికారంలో ఉండగా ప్రతిపక్ష పార్టీల నేతలపై అడ్డగోలుగా మాట్లాడిన మాజీమంత్రి రోజా ప్రాతినిధ్యం వహించే నగరి లాంటి మున్సిపాలిటీలు పోలింగ్‌కు ముందే కూటమికి ఏకగ్రీవమైన 17 మున్సిపాలిటీల్లో ఉన్నాయి.
2021 మున్సిపల్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడి దాదాపు 90 శాతం స్థానాలను కైవసం చేసుకున్న వైకాపా ఇప్పుడు నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లోని డివిజన్లు/వార్డుల్లో 10 శాతం సీట్లనూ సాధించలేకపోయింది.

