N. Chandrababu Naidu: అమరావతితో పాటు అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం చంద్రబాబు
అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం చంద్రబాబు

ఉగాది పచ్చడిలా జీవితంలో కష్టసుఖాలు సహజం..
కుట్రలపై ఏమరుపాటు లేకుండా రాజీలేని పోరాటం: సీఎం చంద్రబాబు
N. Chandrababu Naidu: ఉగాది షడ్రుచుల మాదిరిగానే మన జీవితాల్లో కష్టసుఖాలు ఉంటాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉగాది పచ్చడి మన జీవితాన్ని ప్రతిబింబిస్తుందని, పండుగలు ఆరోగ్యకరమైన జీవనశైలిని నేర్పిస్తాయని వ్యాఖ్యానించారు.
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండితులు మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఆ తర్వాత సీఎం మాట్లాడుతూ..
‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ఉగాది శుభాకాంక్షలు. మాడుగుల నాగఫణి శర్మ బాగా అర్థమయ్యేలా పంచాంగ శ్రవణం చేశారు. భగవంతుడు ఆయనకు చక్కని వాక్చాతుర్యం ఇచ్చాడు. ఈ పరాభవ నామ సంవత్సరం అన్నివిధాలా బాగుంటుందని చెప్పారు. ఉగాది పచ్చడి ఎంత ఇష్టంగా తింటామో.. పంచాంగ శ్రవణం కూడా అలానే వింటాం. సంపద కొంతమందికే సొంతం కాకూడదు.. అందరూ ఆనందంగా ఉండాలి. విలువలు పతనమైన రోజు జీవితాలు భ్రష్టుపడతాయి.
అమరావతితో పాటు అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేసే బాధ్యత తీసుకున్నాం. కుట్రలపై ఏమరుపాటు లేకుండా రాజీలేని పోరాటం చేస్తాం’’ అని స్పష్టం చేశారు.
వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉగాది పండుగ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, పచ్చడి పంపిణీతో పాటు సంబరాలు జరిగాయి. సీఎం ప్రసంగం ప్రజల్లో ఉత్సాహం నింపింది.

