N. Chandrababu Naidu: త్వరలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలి: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు
కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు

N. Chandrababu Naidu: త్వరలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర విజన్ 10 సూత్రాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం సమీక్ష నిర్వహించారు. వివిధ అంశాలపై కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు.
లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించగలిగితే రాష్ట్ర అభివృద్ధి వేగం పుంజుకుంటుందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రైలు మార్గంలో ఒక్క కిలోమీటరుకు రూ.1.83 ఖర్చవుతుంటే, రోడ్డు రవాణాలో రూ.3.40 ఖర్చు చేయాల్సి వస్తోందని వివరించారు. రవాణా వ్యయం గణనీయంగా తగ్గితే ఆంధ్రప్రదేశ్‌కు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
పారిశ్రామిక పార్కులకు రోడ్డు, రైలు కనెక్టివిటీని మరింత పెంచాలని సూచించారు. రాష్ట్రానికి రూ.లక్ష కోట్లకు పైగా విలువైన 64 జాతీయ రహదారి ప్రాజెక్టులు వస్తున్నాయని చెప్పారు. రూ.64 వేల కోట్ల విలువైన 624 రైల్వే ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయని, మరో రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు డీపీఆర్ దశలో ఉన్నాయని వెల్లడించారు. ఎక్స్‌ప్రెస్, లోకల్ ట్రైన్లు, నాలుగు లైన్ల రైల్వే మార్గాల విస్తరణ వంటి పనులు త్వరగా పూర్తి కావాలని ఆదేశించారు. ఆర్వోబీలు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటు ద్వారా ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయన్నారు.
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు తక్కువ పడే అవకాశం ఉందని, దీనికి తగ్గట్టు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. వర్షాధార, మెట్ట, ఉద్యాన పంటలకు అనుగుణంగా నీటి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. స్వచ్ఛ రథాల ద్వారా వ్యర్థాల సేకరణ, స్వచ్ఛ రహదారుల శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.

