N. Chandrababu Naidu: అమరావతికి శాశ్వత చట్టబద్ధత.. ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం చంద్రబాబు
ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం చంద్రబాబు

N. Chandrababu Naidu: రాజధాని అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించాలని కోరుతూ రాష్ట్ర శాసనసభ శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఉదయం సభ ప్రారంభమైన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ముఖ్యమైన తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. తీర్మానం ఆమోదం పొందిన తర్వాత దానిని కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నారు.
స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, “ఏపీకి శాశ్వత రాజధాని నిర్మాణం అవసరమని సీఎం చంద్రబాబు సంకల్పించారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా నిర్ణయాలు మారకూడదు” అని స్పష్టం చేశారు. అమరావతి చట్టబద్ధత తీర్మానంపై సభలో చర్చ కొనసాగుతోంది.
మంత్రి నారాయణ మాట్లాడుతూ, “గత పాలకులు రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని రెండుగా విభజించారు. విభజన తర్వాత రాజధాని లేకుండా పోయింది. 2015 జనవరి 1న ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇచ్చాం. ఫిబ్రవరి నాటికి 34,400 ఎకరాలు 29 వేల మంది రైతులు ఇచ్చారు. వైకాపా నాయకులు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా రైతులు ఎక్కడా తలొగ్గలేదు” అని గుర్తు చేశారు.
మంత్రి అచ్చెన్నాయుడు ప్రసంగించారు. “2014 ఎన్నికల్లో ప్రజలు తెదేపాను గెలిపించారు. విభజన నష్టాన్ని పూరించాలంటే చంద్రబాబు వల్లనే సాధ్యమవుతుందని ప్రజలు నమ్మారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు పని చేశారు” అని అన్నారు.
మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, “ఒక ప్రాంతం కోసం కాదు, రాష్ట్ర ప్రజలందరి కోసమే ఈ రాజధాని నిర్మాణం. వైకాపా చేసిన మూడు రాజధానుల కుట్రను జనసేన తరఫున వ్యతిరేకించాం. రైతులకు కౌలు ఇవ్వకుండా గత వైకాపా ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. పవన్ కల్యాణ్ రాజధానికి వస్తే ముళ్ల కంచెలు వేసి అడ్డుకున్నారు. రైతులను పరామర్శించకుండా ఆపి ఇబ్బంది పెట్టారు. అమరావతి రాష్ట్ర ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం” అని వివరించారు.
కొణతాల రామకృష్ణ ప్రసంగించారు. “రాజధాని విషయంలో మనం మొదటి నుంచి ఇబ్బందులు పడుతున్నాం. చంద్రబాబు, పవన్ నాయకత్వంలో కేంద్ర సహకారంతో ఏపీ అభివృద్ధి జరుగుతోంది. ప్రజాస్వామ్య విలువలను గౌరవించలేని ప్రతిపక్షం ఇక్కడ ఉంది. అమరావతిని రాజధానిగా అంగీకరించి తర్వాత మాట మార్చిన చరిత్ర గత పాలకులది. చరిత్రలో ఎక్కడా రైతులు ఇంత భారీ స్థాయిలో భూములు ఇచ్చింది లేదు” అని అన్నారు.
సుజనా చౌదరి మాట్లాడుతూ, “చాలా మంది వ్యతిరేకించినా రాష్ట్ర విభజన చేశారు. రాజధాని విషయంలో శివరామకృష్ణ కమిటీ సూచనలు చేసింది. అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని గట్టిగా నమ్ముతున్నా. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అమరావతి కేంద్రంగా మారుతుందని విశ్వసిస్తున్నా” అని వ్యక్తం చేశారు.
ఈ తీర్మానం ఆమోదం పొందితే అమరావతి శాశ్వత రాజధానిగా చట్టబద్ధంగా గుర్తింపు పొందుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

