N. Chandrababu Naidu: నా చుట్టూ కాదు.. ప్రజల చుట్టూ తిరగాలి.. అప్పుడే పదవులు వస్తాయి : సీఎం చంద్రబాబు
అప్పుడే పదవులు వస్తాయి : సీఎం చంద్రబాబు

N. Chandrababu Naidu: తెదేపా క్లస్టర్ ఇన్‌ఛార్జుల శిక్షణా సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యమైన సూచనలు చేశారు. ‘‘నా చుట్టూ తిరిగితే పదవులు రావు. ప్రజల చుట్టూ తిరగాలి. క్షేత్రస్థాయిలో బాగా పని చేయాలి. అప్పుడే పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ మీకు ప్రాధాన్యత పెరుగుతుంది’’ అని ఆయన ఉద్బోధించారు.
మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న క్లస్టర్ ఇన్‌ఛార్జుల శిక్షణా కార్యక్రమంలో శుక్రవారం సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. వారితో కలిసి కొంతసేపు క్లాసులు విన్న తర్వాత వారితో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మరిన్ని కీలక అంశాలు వెల్లడించారు. సామాజిక వర్గాల వారీగా జనాభా దామాషా ప్రకారం పదవులు భర్తీ చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో వచ్చే ప్రతి ఎన్నికల్లోనూ తెదేపా ఓటింగ్ శాతం పెరగాలని, అప్పుడే క్లస్టర్ ఇన్‌ఛార్జులు బాగా పని చేసినట్టు అని స్పష్టం చేశారు. తెదేపా ఎథికల్ ఎంపవర్‌మెంట్ పాలసీని అమలు చేస్తున్నామని వివరించారు.
‘‘కార్యకర్తల శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతిసారీ నాకు పాత రోజులు గుర్తొస్తాయి. తెదేపాకు ఉన్న క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు, శిక్షణా వ్యవస్థ గొప్పవి’’ అని చంద్రబాబు ప్రశంసించారు.
వైకాపా ప్రభుత్వం తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల్ని వేధించిందని విమర్శించారు. కానీ తెదేపా ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేని విధంగా యూనిట్‌కు 13 పైసలు తగ్గించిందని, త్వరలో యూనిట్‌కు రూ.1.19 తగ్గించే చర్యలు చేపడతామని ఆయన ప్రకటించారు.
ఈ శిక్షణా సదస్సు ద్వారా క్లస్టర్ ఇన్‌ఛార్జులు మరింత బాధ్యతగా పని చేసి, పార్టీని బలోపేతం చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

