N. Chandrababu Naidu: రాజకీయాలు, పాలనలో వ్యక్తిగత అహాలకు చోటివ్వకుండా ప్రజల ప్రయోజనాల కోసం తాను, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ కలిసి పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అధికారులు, ఉద్యోగులు కూడా అదే స్ఫూర్తితో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

‘బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2025’ అవార్డు అందుకున్న సందర్భంగా గురువారం మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులు, ఉత్తమంగా పనిచేసిన జిల్లా, మండల స్థాయి ఉద్యోగులకు సీఎం ఆత్మీయ విందు ఇచ్చారు. ‘డిన్నర్‌ విత్‌ ది రియల్‌ విన్నర్స్‌’ పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ, ఈ అవార్డు తనకే కాకుండా మొత్తం ‘టీం ఏపీ’ పనితీరుకు దక్కిన గుర్తింపని తెలిపారు.

రాష్ట్రాన్ని గాడిలో పెట్టడంలో మంత్రులు, అధికారులు, ఉద్యోగుల సహకారం కీలకమైందని సీఎం పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయగలిగామని చెప్పారు. 2024 ఎన్నికల విజయాన్ని ప్రత్యేకంగా గుర్తుచేసుకుంటూ, ప్రజలు ఇచ్చిన నమ్మకానికి తగ్గట్టుగా పాలన సాగించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో ప్రభుత్వ విధానం మారిందని చంద్రబాబు వివరించారు. పరిశ్రమలు రావాలని ఎదురు చూడకుండా, ప్రభుత్వమే పారిశ్రామికవేత్తలతో మాట్లాడే విధానం అవలంబిస్తున్నామని చెప్పారు. గూగుల్‌, రిలయన్స్‌, ఆర్సెలార్‌ మిత్తల్‌ వంటి సంస్థల పెట్టుబడులు ఏపీకి రావడం రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన సంకేతమని పేర్కొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story