N. Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌పై సింగపూర్‌కు మొదటి నుంచి సానుకూల దృక్పథం ఉండేదని, అయితే వైకాపా ప్రభుత్వం ఆ సానుభూతిని చెడగొట్టే ప్రయత్నం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతి స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టులో పాల్గొన్న సింగపూర్ సంస్థలను అప్పటి సీఎం జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర వేధింపులకు గురి చేసి వెళ్లగొట్టారని ఆయన ఆరోపించారు. దీంతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆ సంస్థలు రాష్ట్రానికి రావడానికి భయపడుతున్నాయని చెప్పారు. వారిని ఒప్పించి మళ్లీ రాష్ట్రానికి తీసుకురావడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని సీఎం వెల్లడించారు.

ఈ నెల 21 నుంచి 27 వరకు సింగపూర్‌లో ఉత్తమ పరిపాలనా విధానాలపై శిక్షణ తీసుకోవడానికి వెళ్తున్న రాష్ట్ర మంత్రులతో చంద్రబాబు గురువారం మధ్యాహ్నం విందు సమావేశం నిర్వహించారు. సింగపూర్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉత్తమ పరిపాలనా విధానాలు ప్రపంచానికి ఒక నమూనాగా నిలిచాయని సీఎం అన్నారు. ప్రజలకు మరింత వేగంగా, మెరుగైన సేవలు అందించడం, అవినీతికి తావులేకుండా పాలన అందించడం కోసం ఆ విధానాలను పర్యటనలో అధ్యయనం చేయాలని మంత్రులకు సూచించారు.

ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, సింగపూర్‌లో స్థలం లేకపోవడంతో మలేషియాలో ఎకనామిక్ జోన్ అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. వైకాపా పాలనలో జగన్ రాజధాని అభివృద్ధిపై కక్ష సాధించకుండా, సింగపూర్ సంస్థలను తరిమికొట్టకుండా ఉంటే ఆ ఎకనామిక్ జోన్ అమరావతిలోనే ఏర్పాటు చేసేవారని ఆయన అన్నారు.

సమావేశంలో మంత్రులు శిక్షణ షెడ్యూల్‌పై ఛలోక్తులు విసిరారు. సింగపూర్‌లో శిక్షణ తరగతులు ఉదయం 8 గంటలకు మొదలై రాత్రి 7 గంటల వరకు నడుస్తాయని, ఇంత సుదీర్ఘ షెడ్యూల్ సీఎం స్ఫూర్తితోనే రూపొందించారని ఒకరిద్దరు మంత్రులు వ్యాఖ్యానించారు. పర్యటన మొదటి రోజు ఉదయం 6.30 గంటలకు విమానం దిగగానే 8.30 గంటలకు క్లాసులు మొదలవుతున్నాయని వారు తెలిపారు. దీనికి స్పందించిన సీఎం, కష్టపడి పని చేయాలని, ఎప్పటికప్పుడు అప్‌డేట్ అయితేనే సమర్థవంతంగా ప్రజా సేవ చేయగలమని సూచించారు.

సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, పి.నారాయణ, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్‌రెడ్డి, సత్యకుమార్ తదితరులు పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story