N. Chandrababu Naidu: కృష్ణా జిల్లా పమిడిముక్కలలో నిర్వహించిన ‘పేదల సేవలో’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి మళ్లీ అభివృద్ధి వైభవం తీసుకురావడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ప్రజల ఆనందమే తనకు శక్తినిస్తుందని పేర్కొన్నారు.

పింఛన్ల పంపిణీని ప్రభుత్వం భారంగా కాకుండా బాధ్యతగా చూస్తోందని సీఎం తెలిపారు. కార్మికుల నైపుణ్యాభివృద్ధి కోసం ఆధునిక సదుపాయాలతో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మొదటి దశలో 15 నగరాల్లో ఈ కేంద్రాలను ప్రారంభించి, ఫలితాల ఆధారంగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని చెప్పారు.

కృష్ణా జిల్లా అభివృద్ధి అవకాశాలపై మాట్లాడిన చంద్రబాబు, అమరావతి రాజధాని ప్రభావంతో ఈ ప్రాంతానికి కొత్త దిశ లభించిందన్నారు. విశాఖ తర్వాత ఆదాయం, అభివృద్ధి పరంగా కృష్ణా జిల్లా కీలక స్థానంలో నిలుస్తుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి కృష్ణా నదితో అనుసంధానిస్తామని, బందరు పోర్టు నిర్మాణాన్ని డిసెంబరు నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.

అచ్యుతాపురం, గుంటూరు, కర్నూలు, శ్రీసిటీ, తిరుపతి, అమరావతిలో ఈఎస్‌ఐ ఆసుపత్రులు తీసుకువస్తామని సీఎం చెప్పారు. హైదరాబాద్‌-మచిలీపట్నం మార్గాన్ని ఎక్స్‌ప్రెస్‌ రోడ్డుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రజాప్రతినిధుల పనితీరును నేరుగా ప్రజల అభిప్రాయాల ఆధారంగా పరిశీలిస్తామని, సరిగా పనిచేయని వారికి మళ్లీ అవకాశం ఉండదని స్పష్టం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story