Chief Minister Nara Chandrababu Naidu: నీటి బొట్టు విలువను ప్రతి ఒక్కరూ గ్రహించాలని, భూమిని ఒక జలాశయంగా మార్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైన సందేశం ఇచ్చారు. అనంతపురం జిల్లా యాడికిలో ‘నీటి భద్రత - సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు సాగునీటి సంఘాల నాయకులు, రైతులతో సమావేశమయ్యారు.

రాయలసీమ రైతులకు వర్షపు నీటి విలువ ఎంతో బాగా తెలుసని, గతంలోనే ఇంకుడు గుంతలు, పంట కుంటలు తవ్వించి నీటి సంరక్షణకు బాటలు వేశామని సీఎం గుర్తు చేశారు. ఎన్టీఆర్ జలసిరి, నీరు-మీరు, నీరు ప్రగతి వంటి కార్యక్రమాల ద్వారా రైతులకు సహాయం అందించామన్నారు.

“మైక్రో ఇరిగేషన్‌లో దేశంలోనే నంబర్ వన్‌గా ఉన్నాం. రాయలసీమలో 63 శాతం పంటలను మైక్రో ఇరిగేషన్ కిందికి తీసుకొచ్చాం. దీంతో రాయలసీమ హార్టీకల్చర్ హబ్‌గా మారింది” అని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు.

భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడిన సీఎం, “వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం. రాష్ట్రంలోని అన్ని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. జలాశయాలన్నీ జలకళ సంతరించుకున్నాయి. నీటిని నిల్వ చేసుకుంటే చాలు.. అదే సంపద సృష్టిస్తుంది” అని ఉద్ఘాటించారు.

ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యతలపై అవగాహన పెంచాలని సీఎం లక్ష్యం. రైతులు, సాగునీటి సంఘాలు ఒక్కటై నీటి సంరక్షణలో ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Updated On
PolitEnt Media

PolitEnt Media

Next Story