ప్రత్యామ్నాయ ఇంధనాలే సరైన మార్గం: సీఎం చంద్రబాబు

ఆర్టీజీఎస్‌పై సమీక్షలో కీలక ఆదేశాలు

పీఎన్‌జీ విస్తరణ, విద్యుత్‌ పరికరాల ప్రోత్సాహం

N. Chandrababu Naidu: ఎల్పీజీ సరఫరా సమస్యను ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లడమే సరైన పరిష్కార మార్గమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ), ఇండక్షన్ స్టవ్‌లు, ఎలక్ట్రిక్ కుక్కర్ల వంటి విద్యుత్ పరికరాల వినియోగాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు.

సీఎం క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్పీజీ సరఫరా, పంట నష్టాలపై కూడా చర్చించారు. చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘రాష్ట్రంలో పీఎన్‌జీని 100 శాతం వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి జిల్లాలో కనీసం 10 వేల కొత్త కనెక్షన్లు ఇవ్వాలి. శ్రీకాకుళం-కాకినాడ మధ్య పైప్‌లైన్ పునరుద్ధరణ కోసం కేంద్ర మంత్రికి లేఖ రాయాలి. ఏపీ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌కు వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలి’’ అని అధికారులను ఆదేశించారు.

వచ్చే క్యాబినెట్ సమావేశానికి ముందు ‘నేచురల్ గ్యాస్ పాలసీ ఫర్ ప్రమోషన్ ఇన్ కమర్షియల్ సెక్టార్’ అనే విధానాన్ని తీసుకురావాలని సూచించారు. గ్యాస్ సంక్షోభాన్ని విద్యుత్ రంగానికి అవకాశంగా మార్చుకోవాలని, ఇండక్షన్ స్టవ్‌లు, ఎలక్ట్రిక్ కుక్కర్లను ప్రత్యామ్నాయ వనరులుగా ప్రోత్సహించాలని చెప్పారు.

విద్యాసంస్థలు, ఆసుపత్రులు, అంగన్‌వాడీలు, అన్న క్యాంటీన్లు, హోటళ్లకు ప్రాధాన్య క్రమంలో ఎల్పీజీ సిలిండర్లు సరఫరా చేయాలని ఆదేశించారు. అకాల వర్షాల వల్ల ఏర్పడిన పంట నష్టాన్ని అంచనా వేసి ఈ నెల 26వ తేదీలోగా నివేదిక సమర్పించాలని సీఎం సూచించారు.

అధికారులు సీఎంకు వివరాలు అందించారు. గత ఐదు రోజులుగా గృహావసరాల కోసం రోజుకు సగటున 1.80 లక్షల సిలిండర్లు పంపిణీ అవుతున్నట్లు, మరో 14,444 టన్నుల గ్యాస్ నిల్వలు ఉన్నట్లు తెలిపారు. పీఎన్‌జీ విస్తరణకు 2.34 లక్షల కనెక్షన్లు అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రస్తుతం 60 వేల మందికి మాత్రమే అందించినట్లు వివరించారు.

ఈ సమీక్షలో మంత్రి పార్థసారథి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story