N. Chandrababu Naidu Urges: స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్‌లో ఫైళ్ల క్లియరెన్స్ అత్యంత కీలకమైన అంశమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సీఎస్ నుంచి సెక్రటరీలు, హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్లు (హెచ్‌వోడీలు) మొదలుకొని మండల స్థాయి వరకు అన్ని స్థాయిల్లో ఫైళ్ల పరిష్కారంలో వేగం పెంచాలని ఆదేశించారు. మ్యానువల్ ఫైళ్లు దాదాపు లేకుండా చేసేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

రెండవ రోజు కలెక్టర్ల సదస్సులో ఫైళ్ల క్లియరెన్స్, అవేర్‌నెస్, డేటా లీకేజ్ వంటి అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

ఫైళ్లను త్వరగా పరిష్కరిస్తే ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత వేగంగా అందుతాయని సీఎం అన్నారు. పాలనలో టెక్నాలజీని అనుసంధానం చేయడంతోపాటు మానవ స్పర్శ (హ్యూమన్ టచ్) కూడా అన్ని స్థాయిల్లో ఉండాలని వ్యాఖ్యానించారు. 24 గంటల్లోపు ఈ-ఫైళ్లను డిస్పోజ్ చేసేలా మంత్రులు, అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.

ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో అధికారుల పనితీరును నిరంతరం నమోదు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. జిల్లాల్లో ఇ-ఆఫీస్ ద్వారా ఇంకా మ్యానువల్ ఫైళ్లు ఎన్ని ఉన్నాయో గుర్తించి, వాటిని తొలగించాలని సూచించారు. జిల్లా స్థాయిలో హెచ్‌వోడీలు తప్పనిసరిగా ఈ-ఫైళ్లు మాత్రమే జనరేట్ చేయాలని ఆదేశించారు.

ప్రజలకు సేవలు అందించడం, మరింత మెరుగైన పాలన అందించడంలో కలెక్టర్లు వినూత్నంగా ఆలోచించి, కొత్త ఆలోచనలతో ముందుకు రావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ-ఫైళ్ల క్లియరెన్స్ రోజుల నుంచి గంటల స్థాయికి రావడంపై సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో ఉత్తమ పనితీరు కనబరిచిన మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు, సెక్రటరీలను సీఎం అభినందించారు. పెద్ద సంఖ్యలో ఫైళ్లు వచ్చినా సగటున 10 గంటల్లో డిస్పోజ్ చేసిన సీఎస్ సాయి ప్రసాద్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story