సహించమని హెచ్చరించిన సీఎం చంద్రబాబు

ఎంపీ మహేశ్‌ నిర్వాకంపై చంద్రబాబు ఆగ్రహం

పార్టీకి నష్టం చేసేవారిని ఎందుకు మోయాలని మండిపడ్డారు

డ్రగ్స్ వ్యవహారంపై సీరియస్‌.. క్రమశిక్షణ ఉల్లంఘనకు వెసులుబాటు ఉండదు

N. Chandrababu Naidu: ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌ యాదవ్‌ డ్రగ్స్‌ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి నష్టం చేసేవారిని ఎందుకు మోయాలని మండిపడ్డారు. మంగళవారం తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘2024 ఎన్నికల్లో యువతను ప్రోత్సహించాలన్న మంచి ఉద్దేశంతో మహేశ్‌ యాదవ్‌కు సీటు ఇచ్చి చట్టసభలకు పంపాం. ఎంపీగా ఉండి అలాంటి పార్టీలకు వెళ్లడమే తప్పు. వచ్చిన అవకాశాన్ని కొందరు దుర్వినియోగం చేసుకుంటున్నారు. మంచి రాజకీయ నేపథ్యం నుంచి వచ్చినవారే తమకు దక్కిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటే ఎలా?’ అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.

ఏలూరు ఎంపీ చేసిన తప్పునకు పార్టీ సమాధానం చెప్పుకొనే పరిస్థితి రావడం దురదృష్టకరమని ఆయన అన్నారు. తప్పులు చేస్తూ, దురలవాట్లతో పార్టీకి నష్టం చేసేవాళ్లను మోయాల్సిన అవసరమేంటని మండిపడ్డారు.

గతంలో క్రమశిక్షణ ఉల్లంఘించిన నేతలపై కఠిన నిర్ణయాలు తీసుకున్నామని చంద్రబాబు గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీలో నాయకులంతా క్రమశిక్షణతో మెలగాల్సిందేనని, ఎవరికీ వెసులుబాటు ఉండదని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఎంపీ పుట్టా మహేశ్‌ యాదవ్‌ డ్రగ్స్‌ సంబంధిత వ్యవహారం పార్టీని ఇబ్బందులకు గురి చేస్తోందని సీఎం సీరియస్‌గా స్పందించినట్లు తెలిసింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story