ఎవరైనా చర్యలు తప్పవు

N. Chandrababu Naidu: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో ప్రజల భద్రతను ప్రధానంగా పరిగణించాలని, ఈ విషయంలో ఎవరైనా అలసత్వం చూపితే ఉపేక్షించబోనని హెచ్చరించారు. ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ఎవరిపైనైనా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు సహా ఇతర ప్రాజెక్టుల్లో ప్రమాణాలు, నాణ్యత పాటించాలని ఆదేశించారు.

జలవనరుల శాఖపై శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వంతో నిరంతర సంప్రదింపులు జరపాలని, ప్రతి అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖ, జలసంఘానికి తెలియజేయాలని సూచించారు. నివేదికలు, సాంకేతిక వివరాలు, డాక్యుమెంటేషన్‌లో ఎలాంటి లోపాలు ఉండకూడదని ఆదేశించారు. ఏదైనా విమర్శ వచ్చినా తక్షణమే స్పందించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు.

మునుపటి జగన్‌ ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్‌ దెబ్బతిన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. మరమ్మతులు చేస్తే సరిపోతుందని నిపుణులు సూచించినప్పటికీ, ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి నిర్ణయించామని చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వాల్లో నాణ్యతపై రాజీపడిన ఉదాహరణలు ఉన్నాయని, వైఎస్‌ హయాంలో జంఝావతి రబ్బర్‌ డ్యాం కొట్టుకుపోయిన విషయాన్ని గుర్తుచేశారు.

పోలవరం ప్రాజెక్టుకు విదేశీ నిపుణులను తరచూ సందర్శనకు ఆహ్వానించాలని, వీలుకాని పక్షంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వారి సలహాలు తీసుకోవాలని సూచించారు. గడువులు నిర్దేశించుకుని పనులు పూర్తి చేయాలని, అధికారులు, గుత్తేదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ రిలాక్స్‌ అవడానికి వీల్లేదని హెచ్చరించారు. ఎడమ కాలువ పనులను మేఘాద్రిగడ్డ వరకు, కుడి కాలువలో రూ.200 కోట్ల పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. డయాఫ్రం వాల్‌ నిర్మాణాన్ని నెలాఖరులోపు ముగించాలని, 41.15 మీటర్ల వరకు నీటి నిల్వకు అనుగుణంగా పునరావాస, నిర్మాణ పనులు సకాలంలో జరపాలని సూచించారు. నిర్వాసితులతో తరచూ సంప్రదింపులు జరపాలని అన్నారు.

సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, సీఎస్‌ జి.సాయిప్రసాద్‌ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story