Nagarjuna Makes a Massive Donation: నాగార్జున భారీ విరాళం: ఏఎన్నార్ కళాశాల విద్యార్థులకు రూ.2 కోట్ల స్కాలర్‌షిప్‌లు
ఏఎన్నార్ కళాశాల విద్యార్థులకు రూ.2 కోట్ల స్కాలర్‌షిప్‌లు

Nagarjuna Makes a Massive Donation: ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున తమ కుటుంబం తరఫున గుడివాడలోని ఏఎన్నార్ కళాశాల విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల కోసం రూ.2 కోట్లు విరాళంగా అందజేస్తున్నట్లు ప్రకటించారు. తండ్రి అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్) చదువుకోలేదు కానీ, వేలాది మంది విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు కృషి చేశారని ఆయన కొనియాడారు.
కృష్ణా జిల్లా గుడివాడలోని ఏఎన్నార్ కళాశాల వజ్రోత్సవ వేడుకల్లో నాగార్జున ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాలలో నిర్మించిన రూసా భవనాన్ని ఆయన ప్రారంభించారు.
కార్యక్రమంలో మాట్లాడిన నాగార్జున.. 1959లో తండ్రి ఏఎన్నార్ ఈ కళాశాలకు రూ. ఒక లక్ష విరాళం అందించారని గుర్తుచేశారు. ఇప్పుడు తమ కుటుంబం నుంచి రూ.2 కోట్లు స్కాలర్‌షిప్‌ల కోసం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. "మనుషులు శాశ్వతం కారు.. మనం చేసే మంచి పనులే శాశ్వతంగా నిలుస్తాయి" అని ఆయన ఉద్ఘాటించారు.
ఈ వేడుకల్లో మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తదితరులు పాల్గొన్నారు. ఏఎన్నార్ కళాశాల విద్యార్థుల భవిష్యత్తు మరింత బంగారు వర్ణంగా మారేందుకు ఈ విరాళం ఎంతగానో ఉపయోగపడనుంది.

