రెవెన్యూ అంశాలపై మంత్రి వర్గ ఉప సంఘం భేటిలో నిర్ణయాలు

  • ప్రీ హోల్డ్ భూములపై త్వరలో విధాన పరమైన నిర్ణయం
  • ఎస్టేట్, ఇనామ్ భూముల సమస్యలకు పరిష్కారంపై అధ్యయనం


వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు మార్పిడి చేసేందుకు ఉద్దేశించిన నాలా చట్టాన్ని రద్దు చేస్తూ రూపొందించిన ముసాయిదా బిల్లును బుధవారం జరిగే కేబినెట్ సమావేశంలో పెడ్తామని రాష్ర్ట రెవెన్యూ,రిజిస్ర్టేషన్ మరియు స్టాంపుల శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో రెవెన్యూ అంశాలపై ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం భేటి జరిగింది. ఈ భేటిలో మంత్రి అనగాని తోపాటు ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్, మున్సిపల్ శాఖా మంత్రి పి.నారాయణ, దేవాదాయ శాఖా మంత్రి అనం రామనారాయణరెడ్డి, మైనార్టీ సంక్షేమ శాఖా మంత్రి ఎన్ఎండి ఫరూక్ పాల్గొన్నారు. 3వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లోనే నాలా చట్టాన్ని రద్దు చేస్తామని సీఎం ప్రకటించిన విషయాన్ని మంత్రి అనగాని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నాలా రద్దు ముసాయిదా బిల్లుపై సుదీర్ఘ కసరత్తు చేసి పకడ్బందీగా రూపొందించామని, బుధవారం నాడు కేబినెట్ ముందుకు తీసుకువస్తున్నామని చెప్పారు. ప్రీ హోల్డ్ భూములపై పూర్తి స్తాయిలో చర్చిస్తున్నామని, బలహీన వర్గాలకు నష్టం జరక్కుండా, అదే విధంగా అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేలా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. తాము ముందుగా అక్టోబర్ 2వ తేదీలోగా ప్రీ హోల్డ్ భూములపై నిర్ణయం తీసుకోవాలని భావించాలని, కానీ నెల, రెండు నెలలు అటో ఇటో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఏళ్ల తరబడి ఉన్న సమస్య కారణంగా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కార మార్గం చూపించాలి కాబట్టి కొంత సమయం పడుతుందని అన్నారు. రానున్న మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో ఎస్టేట్, ఇనామ్ భూములపై చర్చిస్తామని చెప్పారు. రాష్ర్టంలో సెటిల్ చేయని 70 ఎస్టేట్ గ్రామాలు, 60 ఇనామ్ గ్రామాలు ఉన్నాయని, ఈ గ్రామాల్లో భూముల సమస్యను పరిష్కరించేలా రానున్న సమావేశాల్లో నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story