MLA Nandamuri Balakrishna: త్వరలో తుళ్లూరులో అధునాతన క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం: బాలకృష్ణ
అధునాతన క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం: బాలకృష్ణ

MLA Nandamuri Balakrishna: క్యాన్సర్ చికిత్సను అందరికీ అందుబాటులో ఉంచడమే తమ ప్రధాన లక్ష్యమని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. ఆస్పత్రిలో అధునాతన అల్ట్రాసౌండ్ సహా పలు కొత్త పరికరాలు, అంబులెన్స్‌ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, “బీడీఎల్ సీఎస్‌ఆర్ కార్యక్రమం ద్వారా అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రాన్ని ఆస్పత్రికి విరాళంగా అందించారు. ఈ యంత్రం ఏఐ సాంకేతికతతో పనిచేస్తుంది. తక్కువ సమయంలోనే స్కానింగ్ చేసి, కచ్చితమైన ఫలితాలను ఇస్తుంది” అని తెలిపారు.
“దాతల సహకారంతో పేదలకు మెరుగైన సేవలు అందించగలుగుతున్నాం. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు, పారిశ్రామికవేత్తలు, దాతల మద్దతుతో ఆస్పత్రి ఈ స్థాయికి ఎదిగింది. త్వరలో దీన్ని మరింత విస్తరించాలని భావిస్తున్నాం” అని బాలకృష్ణ వివరించారు.
అంతేకాకుండా, “ఏపీ రాజధాని పరిధిలోని తుళ్లూరులో మరో వారం రోజుల్లో క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం ప్రారంభిస్తాం” అని ఆయన ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సిబ్బంది, దాతలు పాల్గొన్నారు. తుళ్లూరు ప్రాంతంలో క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటు ద్వారా స్థానికులు, ప్రజలకు ఆరోగ్య సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు.

