Nara Lokesh: 2029 ఎన్నికల్లోనూ కూటమిగానే పోరాటం – కార్యకర్తలకు లోకేశ్ పిలుపు
లోకేశ్ పిలుపు

Nara Lokesh: నెల్లూరు జిల్లా కోవూరులో బుధవారం జరిగిన తెలుగుదేశం పార్టీ క్యాడర్ సమన్వయ సమావేశంలో మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, రానున్న 2029 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంలోని పార్టీలు కలిసి పోటీ చేస్తాయని స్పష్టం చేశారు. క్రాస్ ఫైర్, మిస్ ఫైర్, విడాకులు ఉండవని, పార్టీ అధినేతలుగా తమకు ఎలాంటి సందేహాలూ లేవని, ఏదైనా సమస్య వస్తే తాను నేరుగా పవన్ కళ్యాణ్‌కు ఫోన్ చేస్తానని చెప్పారు. చిన్న చిన్న విషయాలు నేతలు మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని సూచించారు.
కోవూరు నియోజకవర్గంలో అద్భుతమైన నాయకత్వం ఉందని, దీన్ని కంచుకోటగా మార్చాలని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెదేపా గెలవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు అక్టోబర్, నవంబర్‌లో జరుగుతాయని, కూటమి పార్టీల అభ్యర్థులకు ఏకపక్ష విజయం రావాలని ఆయన కోరారు. వైఎస్సార్‌సీపీ నాయకులు ఫస్ట్ గ్రేడ్ క్రిమినల్స్ అని, రాజకీయం ముసుగులో కుల, మత విభేదాలు రెచ్చగొడతారని, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వారి దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. తమకు దొంగ పేపర్లు, టీవీ ఛానళ్లు లేకపోయినా కోటి మంది కార్యకర్తలు ఉన్నారని, అంతా మాట్లాడితే ప్రజలు వారి మాటలు నమ్మరని ఆయన అన్నారు.
ఇదే సందర్భంలో నెల్లూరు నగరంలో వీపీఆర్ ఫౌండేషన్, డీఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ నిధులతో ఆర్‌ఎస్‌ఆర్, డీఎస్‌ఆర్ ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభించారు. తర్వాత కోవూరు బైపాస్‌లో ఎన్టీఆర్ భారీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. కోవూరులో ఎన్టీఆర్ విగ్రహం లేని లోటు తీర్చిన వేమిరెడ్డి దంపతులకు అభినందనలు తెలిపారు. కోవూరు తెదేపా కంచుకోటగా ఇప్పటి వరకు ఎనిమిది సార్లు గెలిచామని, ప్రజల కోసం ఏదో చేయాలనే తపన వీపీఆర్ దంపతుల్లో ఉందని అన్నారు.
డీఎస్సీ అంటే జగన్‌కు డ్రగ్స్, శాండ్, చీప్ లిక్కర్ గుర్తుకొస్తాయని ఎద్దేవా చేస్తూ, “మళ్లీ ఛాలెంజ్ చేస్తున్నా.. డీఎస్సీపై చర్చకు నేను సిద్ధం.. జగన్ నువ్వు సిద్ధమా?” అని సవాల్ విసిరారు. అరిగిపోయిన రికార్డులా డీఎస్సీలో అవకతవకలు అంటూ అబద్ధాలు రుద్దుతున్నారని ఆరోపించారు. ప్రజల కోసం ప్రశాంతిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారని, ఆమె గురించి తప్పుగా మాట్లాడే వారి సంగతి చూస్తామని హెచ్చరించారు.
కార్యకర్తలు నాయకుల చుట్టూ కాకుండా ప్రజల చుట్టూ తిరగాలని, పార్టీ పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమాన్ని సమర్థంగా పూర్తి చేయాలని లోకేశ్ కోరారు. సమావేశంలో ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బీద మస్తాన్‌రావు, జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఎండీ ఫరూఖ్, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

