Nara Lokesh: ఔషధాల తయారీ, ఎగుమతులు, పరిశోధన, అభివృద్ధి, మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులను సమన్వయం చేస్తూ భారత ఫార్మా రంగ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందని మంత్రి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా విశాఖలో నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సు-2026 సన్నాహకాల్లో భాగంగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధి బోర్డు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

మంత్రి మాట్లాడుతూ, ఫార్మా రంగంలో ఏపీ దేశంలో మూడో అతిపెద్ద ఎగుమతిదారుగా ఉందని చెప్పారు. అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీకాకుళం, నెల్లూరు, విజయనగరం ప్రాంతాల్లో నాలుగు ఫార్మా క్లస్టర్లు అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. విశాఖపట్నంలో దేశంలోనే మొదటి మెడికల్‌ టెక్నాలజీ పార్క్‌ (ఏఎంటీజడ్‌) ఉందని, రాష్ట్రంలో ఇప్పటికే ఆరు పోర్టులు వినియోగంలో ఉన్నాయని, మరో నాలుగు పోర్టుల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. నక్కపల్లి దగ్గర 2,000 ఎకరాల్లో బల్క్‌ డ్రగ్‌ పార్కు మొదటి దశ పూర్తయిందని, అందులో భూమి, పోర్టు కనెక్టివిటీ, తక్కువ నిర్వహణ వ్యయం, బలమైన ఫార్మా ఎకోసిస్టమ్‌ అందుబాటులో ఉన్నాయని పారిశ్రామికవేత్తలకు వివరించారు. పెట్టుబడి పెట్టే సంస్థలకు రాయితీలు ఇస్తున్నామని ఆయన చెప్పారు. సమావేశంలో ఫార్మా రంగానికి సంబంధించిన వివిధ సంస్థల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

అహ్మదాబాద్‌లో పలువురు పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేశ్‌ వరుస భేటీలు నిర్వహించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. పునరుత్పాదక విద్యుత్, ఫుడ్‌ ప్రాసెసింగ్, ఫార్మా, పైపుల తయారీ, డేటా సెంటర్ల ఎకోసిస్టమ్‌ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాల గురించి కూడా వివరించారు.

టొరెంట్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ సమీర్‌ మెహతా, డైరెక్టర్‌ షాన్‌ మెహతా, హోల్‌టైమ్‌ డైరెక్టర్‌ జిగీష్‌ మెహతాలను కలిసి ఏపీలో సౌర, పవన, హైబ్రిడ్‌ పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని కోరారు. ఫార్మా క్లస్టర్లలో ఏపీఐ తయారీ, ఇంటర్మీడియట్‌ సామర్థ్యాలను విస్తరించే ప్రతిపాదనలు, పంప్డ్‌ స్టోరేజ్, గ్రీన్‌ హైడ్రోజన్‌ సంబంధిత ప్రాజెక్టులకు ఏపీని ఎంపిక చేసుకోవాలని సూచించారు.

వెల్‌స్పన్‌ గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్‌ (జీసీసీ)ని విశాఖపట్నంలో ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలించాలని ఆ సంస్థ ఇండియా గ్రూప్‌ సీఈవో నితిన్‌ జైన్‌ను కోరారు. కాకినాడలో టెక్స్‌టైల్స్, లాజిస్టిక్, డీఐ పైపుల తయారీ, పైపు కోటింగ్‌ యూనిట్, గ్రీన్‌ అమ్మోనియా తయారీ యూనిట్ల కోసం ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాకినాడ లేదా అనకాపల్లిలో పైపుల తయారీ కేంద్రం ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలించాలని ఆస్ట్రల్‌ పైప్స్‌ లిమిటెడ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (కార్పొరేట్‌ అఫైర్స్‌) అల్కేష్‌ పంచల్‌ను కోరారు.

నక్కపల్లి క్లస్టర్‌లో బయోసిమిలర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని ఎంక్యూర్‌ ఫార్మాస్యూటికల్స్‌ గ్లోబల్‌ ప్రెసిడెంట్‌ (టెక్నికల్, ఆపరేషన్స్‌) దీపక్‌ గొండాలియాను కోరారు. సోలార్‌ మాడ్యూల్స్‌ తయారీ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని విశాఖ గ్రూప్‌ ఎండీ జిగిష్‌ దోషీని కోరారు. ఎయిర్‌ పోర్టు, సీపోర్టులకు సమీపంలో ఉన్న నెల్లూరు, తిరుపతి, విశాఖపట్నం, అనకాపల్లిలో ఫ్లెక్సిబుల్‌ ప్యాకేజింగ్‌ యూనిట్‌ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని సూచించారు.

డేటా సెంటర్‌ హబ్‌గా అభివృద్ధి చెందిన విశాఖలో పెట్టుబడులు పెట్టాలని ఎస్‌టీ టెలీ మీడియా వైస్‌ ప్రెసిడెంట్‌ (స్ట్రాటజీ, సస్టెయినబులిటీ) గౌతమ్‌ జెనా, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (గ్లోబల్‌ డేటా సెంటర్స్‌-ఇండియా) లలిత్‌ టి కన్నాలను కోరారు. నెల్లూరులో ఉన్న ఎడిబుల్‌ ఆయిల్స్‌ ప్లాంట్‌ విస్తరణలో భాగంగా పామాయిల్, సోయాబీన్‌ ఆయిల్‌ రిఫైనరీలు ఏర్పాటు చేయాలని గోకుల్‌ ఆగ్రో రిసోర్సెస్‌ సీఎండీ కనుభాయ్‌ జె ఠక్కర్‌ను కోరారు. విశాఖపట్నంలో డేటా సెంటర్ల కోసం ప్రీఫ్యాబ్‌ నిర్మాణ కేంద్రం ఏర్పాటు చేయాలని ఈప్యాక్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ భజరంగ్‌ బోత్రాను కోరారు. విశాఖపట్నంలో టైర్ల తయారీ ప్రాజెక్టు ప్రతిపాదనను పరిశీలించాలని చిరిపాల్‌ గ్రూప్‌ ఎండీ బ్రిజ్‌ మోహన్‌ చిరిపాల్, గ్రూప్‌ అనుబంధ సంస్థ గ్రూ సోలార్‌ సీఈవో వినయ్‌ థదానీలకు సూచించారు.

ఇలా వివిధ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు.

Next Story