National Saras Mela: విజయవాడలోని కృష్ణా తీరంలో జాతీయ సరస్‌ మేళా-2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.

రాష్ట్రపతి సరస్‌ మేళాలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన సహజ ఉత్పత్తులు, చేనేత వస్తువులు, హ్యాండీక్రాఫ్ట్‌లను వీక్షించారు. ఉత్పత్తుల ప్రత్యేకతలపై డ్వాక్రా మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఓ స్టాల్‌లో చీర కొనుగోలు చేసి డిజిటల్‌ చెల్లింపు చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితం ప్రతి ఆడబిడ్డకు ఒక సందేశమని అన్నారు. మహిళలకు సంకల్పం ఉంటే ఎలాంటి ఉన్నత శిఖరాలనైనా అధిరోహిస్తారని ఆమె నిరూపించారని చెప్పారు. ఇది నారీ శక్తి, నవభారత్‌ శక్తి, వికసిత్‌ భారత్‌కు పునాది అని పేర్కొన్నారు.

సరస్‌ మేళా గురించి మాట్లాడుతూ సీఎం.. ‘‘ఇది కేవలం మేళా కాదు.. 365 రోజులూ మార్కెట్‌ ఏర్పాటుకు అవకాశం. గ్రామీణ మహిళల ఆదాయం పెంచడం, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం మేళా లక్ష్యం. కొత్త వ్యాపారాలకు అవకాశాలు సృష్టించాలి. నిన్నటి పొదుపు సంఘాలు.. నేటి వ్యాపార సంస్థలు.. రేపటి అంతర్జాతీయ బ్రాండ్లు కావాలి’’ అని ఆకాంక్షించారు.

Next Story