Lokesh: రాష్ట్రవ్యాప్తంగా ఏపీ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో అకడమిక్‌ ఎక్స్‌లెన్స్‌పై దృష్టి సారించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ సూచించారు. ఏపీ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ (ఏపీఆర్‌ఈఐఎస్‌) గవర్నింగ్‌ బాడీ సమావేశం మంత్రి లోకేశ్‌ అధ్యక్షతన ఉండవల్లి నివాసంలో శుక్రవారం జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. “ఏపీ రెసిడెన్షియల్‌ పాఠశాలలు ప్రతిభావంతులను తయారుచేసే కేంద్రాలుగా మారాలి. అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ ఎక్స్‌లెన్స్‌పై దృష్టి సారించాలి. జగ్గంపేట నియోజకవర్గంలోని భూపతిపాలెం పాఠశాలలో ప్రపంచస్థాయి ఎకోసిస్టమ్‌ అభివృద్ధి పరిచి, విద్య, క్రీడా హబ్‌గా తీర్చిదిద్దాలి. రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో కంప్యూటర్‌ ల్యాబ్స్‌, ఏఐ నైపుణ్యం తప్పనిసరి చేయాలి. పరిశ్రమల డిమాండ్‌కు అనుగుణంగా వృత్తివిద్యా కోర్సుల్లో విద్యార్థులకు శిక్షణ అందించాలి. అన్ని విద్యాసంస్థల్లో స్మార్ట్‌ కిచెన్లను ఏర్పాటు చేయాలి” అని సూచించారు.

సమావేశంలో రాష్ట్రంలో 10 ఏపీఆర్‌ఈఐఎస్‌లను సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లుగా అభివృద్ధి చేయాలని ఆమోదం తెలిపారు. ఇప్పటికే తాడికొండ, కొడిగినహళ్లి పాఠశాలలు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లుగా ఉన్నాయి. కృష్ణా జిల్లా నిమ్మకూరు ఏపీఆర్‌జేసీలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి జేఈఈ, నీట్‌ అకాడమీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఆరు పాఠశాలలను జూనియర్‌ కళాశాలలుగా ఉన్నతీకరించేందుకు, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బోధన, బోధనేతర సిబ్బందిని నియమించేందుకు కూడా ఆమోదం తెలిపారు. సిబ్బంది సర్వీస్‌ రూల్స్‌ రూపకల్పన కోసం కమిటీ ఏర్పాటుకు, ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచే ప్రతిపాదనను ఆమోదించారు. అతిథి అధ్యాపకులకు గౌరవ వేతనాలను ఇతర సొసైటీలతో సమానంగా ఇవ్వాలని, పీఈటీలను పీడీలుగా ఉన్నతీకరించాలని నిర్ణయించారు. విద్యార్థులకు అత్యవసర వైద్య సదుపాయం కోసం రూ.లక్ష వరకు ఖర్చు చేసే వెసులుబాటును కార్యదర్శికి కల్పించారు.

ఈ పాఠశాలల్లో చదువుకున్న వారిలో దాదాపు 27 మంది ఐఏఎస్‌, 20 మంది ఐపీఎస్‌, 13 మంది ఐఆర్‌ఎస్‌, నలుగురు ఐఎఫ్‌ఎస్‌ అధికారులుగా ఎంపికయ్యారని, ఎంతోమంది అత్యున్నత స్థానాల్లో సేవలందిస్తున్నారని అధికారులు మంత్రికి వివరించారు.

Next Story