ఎట్టి పరిస్థితుల్లో రాజీ లేదు: సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu: కరోనా కష్టకాలంలో కూడా రైతులు శ్రమించి ప్రజలందరికీ అన్నం పెట్టారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలోని రాయవరంలో గురువారం జరిగిన పర్యటనలో ఆయన పాల్గొన్నారు. రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ... గత ప్రభుత్వం రైతుల భూమి పత్రాలపై జగన్ ఫొటో ఎందుకు వేయించిందో అర్థం కావడం లేదని విమర్శించారు. అవి ప్రమాదకరమైన ఆలోచనలని, ఎన్నికల ప్రచారంలోనే ‘మీ భూమి - మీ హక్కు’ అని తాము చెప్పినట్లు గుర్తు చేశారు. రాజముద్ర వేసి పాస్‌బుక్‌లు ఇస్తామని ఇచ్చిన హామీని ఇప్పుడు నెరవేర్చామని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ‘‘గ్రామసభలు నిర్వహించి ఈ నెల 11వ తేదీ వరకు రైతులకు పాస్‌బుక్‌లు పంపిణీ చేస్తున్నాం. ఒక్క రూపాయి అవినీతి లేకుండా జరగాలని అధికారులకు ఆదేశించాను. ఎమ్మార్వోలు, ఆర్డీవోలు, ఇతర సిబ్బంది మనసుపెట్టి పని చేయాలి. వచ్చే నెలలో మరోసారి సర్వే నిర్వహించి పాస్‌బుక్‌లు ఇస్తాం. ఒక్కసారి ప్రింట్ అయిన తర్వాత జీరో మిస్టేక్స్ ఉండేలా చూడాలి. భూములకు సంబంధించి 29 రకాల ఫిర్యాదులు వచ్చాయి. అన్నీ పరిష్కరిస్తున్నాం. 22-ఏ భూముల సమస్యలను కూడా త్వరగా పరిష్కరిస్తాం. రైతుల భూరికార్డులన్నీ బ్లాక్‌చైన్ టెక్నాలజీలో భద్రపరుస్తాం. ఎవరైనా భూకబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. చిన్న చిన్న భూవివాదాలు పెట్టుకోవద్దు. కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య గొడవలు వద్దు. కోర్టులకు వెళితే జీవితకాలం వృథా అవుతుంది’’ అని హితవు పలికారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ... ‘‘నరకాసురుడి పాలన మళ్లీ రాకూడదని అందరూ కోరుకోవాలి. గోదావరి పుష్కరాలు వచ్చిన మూడు సార్లూ నేనే సీఎంగా ఉండటం నా అదృష్టం. సముద్రంలోకి వెళ్లే నీటిలో 300 టీఎంసీలు వినియోగిస్తే కరువు ఉండదు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతానికి నీటి సమస్యే ఉండదు. పోలవరం నుంచి విశాఖపట్నం వరకు, అక్కడ నుంచి వంశధార నదికి నీటిని తరలిస్తాం. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడబోం. గొడవలు పెట్టుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు. మనవద్ద నీళ్లు మిగిలితే తెలంగాణ కూడా వాడుకోవచ్చు. శ్రీశైలం నుంచి నీటిని పొదుపు చేసి రాయలసీమకు తరలిస్తాం’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.

Updated On 9 Jan 2026 9:48 PM IST
PolitEnt Media

PolitEnt Media

Next Story