AP Minister Nara Lokesh: విపక్ష ఓ వైకాపా అడ్డగోలు విమర్శలకు ఇక ఆత్మరక్షణ ధోరణి వద్దని, ఎదురుదాడి చేస్తూ ఆఫెన్సివ్‌గా ముందుకెళ్లాలని మంత్రి నారా లోకేశ్‌ సూచించారు. శాసనసభలోని తెదేపా శాసనసభాపక్ష కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన ఇష్టాగోష్టిగా చర్చించారు.

లోకేశ్‌ మాట్లాడుతూ, శాసనమండలిలో వైకాపా సభ్యుల వ్యవహార శైలిని, మంత్రులు దీటుగా బదులివ్వడాన్ని ప్రస్తావించారు. "ఈసారి మన మంత్రుల టీమ్‌వర్క్ బాగుంది. ఇప్పటివరకు విపక్షం విమర్శలు చేస్తుంటే మనం డిఫెన్స్‌ ఆడుతూ సమాధానాలిస్తున్నాం. ఇకపై గేరు మార్చి మనమే అఫెన్స్‌ ఆడదాం" అని స్పష్టం చేశారు.

గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేశారో ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పాలని, దీనిలో మంత్రులు కీలక పాత్ర పోషించాలని ఆదేశించారు. ఇన్‌ఛార్జి మంత్రులు జిల్లాల్లో సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి. జిల్లాల్లో ఎక్కువ సమయం వెచ్చిస్తూ ఎమ్మెల్యేలు, కార్యకర్తల మధ్య సమన్వయం పెంచాలని సూచించారు.

"ఈసారి పార్టీకి ఎక్కువ సమయం కేటాయిస్తున్నాను. ఎన్ని ముఖ్యమైన పనులున్నా ఆ విషయంలో రాజీ పడటం లేదు. మంత్రులూ అదే రీతిలో పనిచేయాలి" అని లోకేశ్‌ పేర్కొన్నారు.

అదనంగా, యలమంచిలి నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ బ్లూజెట్‌కు ఈ నెల 28న శంకుస్థాపన జరుగుతుందని తెలిపారు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ఒక ఉద్యోగి పంపిన సందేశం ఆధారంగా ఆ కంపెనీని రాష్ట్రంలో పరిశ్రమ ఏర్పాటు చేసేలా ఒప్పించామని వివరించారు.

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన తెదేపా మద్దతుదారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెలాఖరులోపు సమావేశమవుతారని కూడా లోకేశ్‌ తెలియజేశారు.

సమావేశంలో సరదాగా మాట్లాడుతూ, పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధరించిన చొక్కా, పెన్ను, వాచీ, కళ్లజోడు అన్నీ గోల్డ్ కలర్‌లో ఉన్నాయని, మనిషే గోల్డ్ అని వ్యాఖ్యానించారు. బుచ్చయ్య కూడా తన మనసు కూడా గోల్డేనని సరదాగా బదులిచ్చారు. కుర్రాళ్లతో పోటీ పడాలంటే ఆ మాత్రం మెయింటెనెన్స్ అవసరమని ఆయన అన్నారు.

Next Story