భూములిస్తే తప్పేం లేదు: నారా లోకేష్

Nara Lokesh: అమరావతి రాజధానికి చట్టబద్ధమైన హోదా ఉన్నందునే గత ప్రభుత్వం దాన్ని తరలించలేకపోయిందని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయని, ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకు అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి సాగుతోందని ఆయన పేర్కొన్నారు. దేశంలోనే పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని గుర్తు చేశారు.

అమరావతికి అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం అవసరమని, అందుకు భూసేకరణ చేపడుతున్నట్లు లోకేష్ తెలిపారు. పెద్ద ప్రాజెక్టుల పూర్తికి కొంత సమయం పడుతుందని వివరించారు. శ్రీకాకుళం నుంచి అనకాపల్లి వరకు వేగవంతమైన అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. కొందరు ఎకరా భూమిని 99 పైసలకే ఇస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారని, అయితే పెద్ద కంపెనీలకు తక్కువ ధరకు భూములు కేటాయిస్తే తప్పు ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెరగాలి, యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగాలనేదే ప్రభుత్వ లక్ష్యమని లోకేష్ డిఫెండ్ చేశారు.

విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా మారుతోందని, ఇక్కడికి ఐటీ, ఫార్మా, డేటా సెంటర్లు, స్టీల్ సిటీలు వంటి పరిశ్రమలు వస్తున్నాయని ఆయన హైలైట్ చేశారు. కూటమి ప్రభుత్వం అన్ని ప్రాంతాలనూ సమానంగా అభివృద్ధి చేయాలనేదే విధానమని పునరుద్ఘాటించారు. సామాజిక మాధ్యమాల్లో వేధింపులు, ద్వేషపూరిత పోస్టులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, చట్టాన్ని ఉల్లంఘించిన వారిని ఎవరైనా వదలబోమని హెచ్చరించారు.

నీటి వివాదంపై స్పందన

సముద్రంలో కలిసిపోతున్న వేల టీఎంసీల నీటిని కాపాడి రాయలసీమకు తరలిస్తే తప్పు ఏమీ లేదని లోకేష్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టులకు తాము ఎక్కడా అడ్డంకులు కల్పించలేదని, మిగిలిన నీటిని తెలంగాణ లేదా చెన్నైకి ఇవ్వవచ్చని చెప్పారు. గతంలో పట్టిసీమ ప్రాజెక్టును దండగ అని విమర్శించిన జగన్ ప్రభుత్వం దాన్నే ఐదేళ్లు వినియోగించుకుందని గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం తమ బాధ్యతగా లోకేష్ పేర్కొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story