నేడు జైలు నుంచి విడుదలైన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టీకరణ

అధికార తెలుగుదేశం పార్టీ మమ్మల్ని ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు ఎవ్వరూ తమ పంథాను మాత్రం మార్చుకోరని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తేల్చి చెప్పారు. కూటమి ప్రభుత్వం పెట్టిన అనేక కేసుల్లో 86 రోజుల పాటు రిమాండ్‌ ఖైదీగా జైలు జీవితం గడిపిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి బుధవారం జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా పెద్దయెత్తున వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు, కాకాణి అభిమానులు జైలు వద్దకు వచ్చి ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం కాకాణి మీడియాతో మాట్లాడుతూ తన మీద కూటమి సర్కార్‌ అనేక అక్రమ కేసులు పెట్టిందని కాకాణి చెప్పారు. సర్వేపల్లి రిజర్వాయ్‌లో ఉన్న మట్టిని బాంబులు పెట్టి పేల్చినట్లు పెట్టిన ఓ కేసు విషయంలో మేజిస్ట్రేట్‌ రిమాండ్‌ రిజక్ట్‌ చేశారని, ఎక్కడా బాంబులు పెట్టి పేల్చినట్లు ఫిర్యాదులో ఎక్కడా లేదేమని మేజిస్ట్రేట్‌ ప్రశ్నించారని కాకాణి మీడియాకు వెల్లడించారు. ఈవిధంగా తనపై రకరకాలైన చిత్రివిచిత్రమైన కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము కానీ, మా వైఎస్‌ఆర్‌సీపీ కుటుంబ సభ్యులు కష్టకాలంలో ఉన్నప్పుడు మమ్మల్ని పరామర్శించడానికి మా నాయకుడు వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి నెల్లూరు వస్తుంటే ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టిందో ప్రజలందరూ చూశారని గోవర్ధన్‌రెడ్డి అన్నారు. అక్రమ కేసులు బనాయించి మమ్మల్ని జైల్లో పెట్టడం ద్వారా ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, చంద్రబాబు చేస్తున్న మోసాలు ప్రజల్లోకి తీసుకువెళ్లకుండా తాత్కాలికంగా అడ్డుకున్నారు తప్పితే మా లక్ష్య సాధనలో ఈ కేసులు అడ్డుకావని ఆయన స్పష్టం చేశారు. అలాగే మేము లేకపోవడం వల్ల సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆయన కుమారుడు చేస్తున్న అవినీతికి అడ్డుకట్ట లేకుండా పోయిందని అయితే భవిష్యత్తులో వీటన్నింటిపై విచారణ జరుగుతుందని తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని కాకాణి పేర్కొన్నారు. నామీద పెట్టిన ఎనిమిది కేసుల్లో నేను తప్పు చెయ్యలేదు నాకు బెయిల్‌ మంజూరు చేయండి అని అడిగాను తప్పితే నాకు ఆరోగ్యం బాలేదనో ఇంకో కారణమో చెప్పి ఏ కోర్టులో కూడా బెయిల్ అడగలేదన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని బలోఏతం చేస్తూనే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు.

Updated On 20 Aug 2025 12:54 PM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story