CM Chandrababu: అమరావతే కాదు.. విశాఖను కూడా విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నాం: సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు

CM Chandrababu: అభివృద్ధి విషయంలో ఒక్క అమరావతి మీదనే దృష్టి సారించడం లేదని, విశాఖపట్నాన్ని కూడా విశ్వనగరంగా అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో కిమ్స్ ఆసుపత్రి, వైద్య విశ్వవిద్యాలయం నిర్మాణం కోసం బుధవారం సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
రాయలసీమను రత్నాల సీమగా మారుస్తున్నామని, ఆ ప్రాంతానికి అనేక పరిశ్రమలు వస్తున్నాయని సీఎం తెలిపారు. అనంతపురం ఏరోస్పేస్ హబ్‌గా, రాయలసీమ టెక్నాలజీ హబ్‌గా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. తిరుపతిలో ఏరోస్పేస్ సిటీ, కర్నూలులో డ్రోన్ సిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. శ్రీసిటీ ఇప్పటికే ఇండస్ట్రియల్ హబ్‌గా మారిందని చెప్పారు.
కీలక ప్రకటనలు:
2027 మే 13న కిమ్స్ ఆసుపత్రిని ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారు.
2028 ఆగస్టు 15లోపు విశాఖలో గూగుల్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.
2028 డిసెంబరులోపు ఆర్సెల్లార్ మిత్తల్ ప్రాజెక్టు ఫేజ్-1 పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చామన్నారు.
అన్ని అనుమతులు త్వరగా ఇస్తామని, లక్ష మందికి స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
వైద్యులు ఏఐ నేర్చుకుంటున్నారని, లక్ష మందికి ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ప్రపంచంలోని ప్రతి ముగ్గురు వైద్యుల్లో ఒకరు అమరావతి నుంచి ఉండాలని ఆకాంక్షించారు.
డిసెంబరు నాటికి అమరావతి భారత్‌లో క్వాంటం కంప్యూటింగ్‌కు చిరునామాగా మారుతుందని వెల్లడించారు.
భవిష్యత్ ప్రణాళికలు:
గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని ప్రోత్సహించి విదేశాలపై ఆధారపడకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం చెప్పారు. ప్రతి పొలం, ఇంటి పైకప్పులపై సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేస్తామన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వంలోనూ వర్క్ ఫ్రమ్ హోం వ్యవస్థ తీసుకురానున్నట్లు ప్రకటించారు. అరకు, పాపికొండ, గండికోట వంటి ప్రదేశాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసి, సూర్యలంకను గోవాను మించిన టూరిజం హబ్‌గా మార్చనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, వివిధ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

