వైఎస్‌ఆర్‌సీపీ యూత్‌ వింగ్‌ సమావేశంలో వైఎస్‌.జగన్‌

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీయడంలో యువతది కీలక పాత్ర అని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్సీపీ అధినేత వైఎస్‌.జగన్మోహనరెడ్డి అన్నారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ యువజన విభాగం ప్రతినిధులతో వైఎస్‌.జగన్‌ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ రాజకీయ పార్టీల్లో యువజన విభాగం అత్యంత క్రియాశీలకమైనదన్నారు. యూత్‌ వింగ్‌ లో ఉన్న వారు ప్రభావవంతంగా పనిచేయాలని సూచించారు. రాజకీయంగా ఎదగడం మీ చేతుల్లో ఉంటుందని, మిమ్మల్ని రాజకీయంగా పెంచడం నా చేతుల్లో ఉందని వైఎస్‌.జగన్‌ అన్నారు. రాజకీయంగా పెరగాలన్నా, ఎదగాలన్నా మీరు కష్టపడాలన్నారు. సమర్ధత ఉన్న వారిని పార్టీ వ్యవస్ధల్లోకి తీసుకువచ్చి పార్టీని సంస్ధాగతంగా బలోపేతం చేయమని యువజన విభాగం నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన యువకులను జోన్ల వారీగా యూత్‌ వింగ్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా నియమిస్తున్నామని వైఎస్‌.జగన్‌ ప్రకటించారు. అలాగే ప్రతి ఒక్కరూ సోషల్‌ మీడియాలోకి రావాలని, వాస్తవాలను చెప్పడానికి సోషల్‌ మీడియా ఒక ఆయుధం వంటిదని చెప్పారు.

నాయకులుగా ఎదిగేందుకు ఇప్పుడు గొప్ప అవకాశం ఉందని వైఎస్‌జగన్‌ అన్నారు. పార్టీ ప్రారంభించినప్పుడు అందురూ కొత్తవాళ్ళే నేనూ అమ్మా మాత్రమే ఉన్నామన్నారు. నామీద వ్యక్తిగతంగా అభిమానం ఉన్న వాళ్ళు నాతో వచ్చారు, ఎన్ని కష్టాలు వచ్చినా, విలువలు, విశ్వసనీయతకు పెద్దపీట వేశామని చెప్పారు. రాజకీయంగా ఇబ్బంది వచ్చినా ఏ దశలోనూ రాజీ పడలేదన్నారు. ఉప ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజార్టీ వచ్చింది.. పార్లమెంటులో ప్రతి సభ్యుడు మనవైపు చూసే పరిస్ధితికి వచ్చాం.. దాన్ని జీర్ణించుకోలేక మనమీద పగబట్టారన్నారు. 18 మంది ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తే వాళ్ళందిరితో రాజీనామాలు చేయించానని, ఆ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌, టీడీపీ కలిసి పోటీ చేసినా మనం ఘన విజయం సాధించామని గతాన్ని గుర్తు చేసుకున్నారు. 2014లో 67 మందితో గెలిస్తే మళ్ళీ మన దగ్గర నుంచి 23 మందిని లాక్కున్నారన్నారు. ఎప్పుడైనా ప్రజలకు అందుబాటులో ఉండటమనేది ముఖ్యమని ప్రజలకు సమస్య వచ్చినప్పుడు వారికి తోడుగా నిలబడాలని, మన నుంచి మంచి పలకరింపు ఉండాలని ఇవి చేయగలిగితే నాయకుడిగా ఎదుగుతారని వైఎస్‌.జగన్మోహనరెడ్డి వైసీపీ యూత్‌ వింగ్‌ కార్యకర్తల భేటీలో ప్రసంగించారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story