Nara Lokesh Singapore Tour : ఎన్ఆర్ఐలే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్లు
సింగపూర్ తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి లోకేష్

- భారత్ ఎఫ్ డిఐలలో సింహభాగం సింగపూర్ నుంచే
- ఎపిలో సింగపూర్ ఎఫ్ డిఐలకు సహకరించండి
- 20లక్షల ఉద్యోగాలు మా నినాదం... మా విధానం
- 5ఏళ్లలో జరిగిన నష్టం వడ్డీతో సహా తీసుకొస్తాం
మన రాష్ట్రంలో ఉన్న అవకాశాలను ప్రచారం చేసి పెట్టుబడులు రాబడదామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. సింగపూర్ ఓవిస్ ఆడిటోరియంలో ఎపిఎన్ఆర్ టి ఆధ్వర్యాన నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశానికి మంత్రి లోకేష్ అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఎన్నారైలే మా బ్రాండ్ అంబాసిడర్లు, రాష్ట్రాభివృద్ధిలో ఎన్ఆర్ఐ లంతా భాగస్వాములు కావాలి. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో విదేశీ పెట్టుబడులు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. మన దేశానికి వచ్చే విదేశీ పెట్టుబడుల్లో సింగపూర్ నుంచే అధికశాతం ఉంటాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం మొత్తం $81.04 బిలియన్ల విదేశీ ప్రత్యక్ష పెట్టబడులు వస్తే, అందులో సింగపూర్ నుంచే దాదాపు $14.94 బిలియన్ల పెట్టుబడులు వచ్చాయి. మొత్తం ఎఫ్ డిఐలలో సింగపూర్ నుండి 19శాతం ఉన్నాయి. ఈ పెట్టుబడుల్లో అధికశాతం ఏపీకి వస్తే మన రాష్ట్రం మరో సింగపూర్ అవుతుంది. సింగపూర్, మలేషియా, థాయిలాండ్, వియత్నాం, ఫిలిప్పీన్స్, హాంకాంగ్, ఇండోనేషియా, జకార్తా & బాలిలో ఉన్న తెలుగువారికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు మేమున్నాం. ఎపిఎన్ఆర్ టి ద్వారా మీ సమస్యలు పరిష్కరించడంతో పాటు మన తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలు కాపాడటానికి మేము పనిచేస్తున్నాం. ఇకడ ఉద్యోగులుగా ఉన్న మీలో చాలా మంది మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి యాజమానులుగా మారడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. మీరు స్టార్టప్ లు పెట్టాలన్నా, పరిశ్రమలు పెట్టాలన్నా ఈడిబి సేవలు ఉపయోగించుకోండి. మన రాష్ట్రం మీకు సాదర స్వాగతం పలుకుతోందని నారా లోకేష్ ప్రవాశాంధ్రులను ఆహ్వానించారు.
మీరు ఎన్ఆర్ఐలు కాదు...ఎంఆర్ఐలు
నాకు ఇష్టమైన, నేను స్పూర్తి పొందిన నాయకుల్లో లీ కువాన్ యూ ఒకరు. 31 ఏళ్లు నిరంతరంగా ప్రధాన మంత్రిగా పనిచేసి ఒక్క మత్స్యకార గ్రామాన్ని గ్లోబల్ ఎకనమిక్ పవర్ హౌస్ గా మార్చారని లోకేష్ కొనియాడారు. సింగపూర్ లో తెలుగు వారి ఉత్సాహం సూపర్. ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయిన దగ్గర నుండి తెలుగు ప్రవాసుల సమావేశం వరకు ఎక్కడ చూసిన తెలుగువాళ్లే. నేను సింగపూర్‌లో ఉన్నానా లేక సింహాచలంలో ఉన్నానా అని సందేహం వచ్చింది. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లిన తెలుగు వారి ఆధిపత్యమే కనిపిస్తోంది. ఇక్కడికి వచ్చాక కూడా నాకో విషయం అర్ధం అయింది. సింగపూర్ ని శాసించేది కూడా తెలుగువాళ్లే. అందరూ మిమ్మల్ని ఎన్నారైలు అంటారు అంటే ప్రవాస భారతీయులు. కానీ నా మనసులో ఎప్పుడు మీరు ఎంఆర్ఐలే... MRI అంటే అత్యంత విశ్వసనీయ భారతీయులు
ఎన్నికల్లో ఎన్ఆర్ఐల కీలకపాత్ర
కష్టపడి చదువుకొని విదేశాల్లో సెటిల్ అయ్యారు. ఉన్నత ఉద్యోగాలు, వ్యాపారాల్లో రాణిస్తూ తెలుగువారు సత్తా చాటుతున్నారు. మనిషి సింగపూర్ లో, మలేషియాలో ఉన్నా... మీ మనసంతా ఎప్పుడూ మన రాష్ట్రం పైనే ఉంటుంది. రాష్ట్రం పై మీకు ఎంత ప్రేమ ఉందో గత ఎన్నికల్లో చూసాను. రాష్ట్రం లో సైకో పాలన పోవాలని ప్రపంచంలో ఉన్న తెలుగు వారంతా ఏకమయ్యారు. చంద్రబాబు అరెస్ట్ చేసి 53 రోజులకి జైలులో పెట్టినపుడు బాధపడ్డాం. రాష్ట్రం కోసం, ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తిని అన్యాయంగా జైల్లో పెట్టారు... ఇటువంటి రాజకీయాలు అవసరమా అని బ్రాహ్మణి నాతో అంది. అప్పుడు నేను కూడా ఆలోచనలో పడ్డాను. కానీ అదే రోజు హైదరాబాద్‌లో ఉన్న ఐటీ నిపుణులు అంతా కలిసి ఒక భారీ కాన్సెర్ట్ నిర్వహించారు. ఆయనని జైలులో పెట్టిన 53 రోజులు వివిధ దేశాల్లో ఉన్న తెలుగు వారు రోడ్ల పైకి వచ్చి నిరసన తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరంతా సెలవలు పెట్టి మరీ రాష్ట్రానికి వచ్చి పని చేసారు. కూటమి ప్రభుత్వం 94% స్ట్రైక్ రేట్ తో 164 సీట్లు గెలవడంలో ఎన్ఆర్ఐలు కీలక పాత్ర పోషించారు. ఎన్ఆర్ఐలకు 4 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి గెలిపించుకున్నాము, నామినేటెడ్ పోస్టులు కూడా ఇచ్చామని నారా లోకేష్ పేర్కొన్నారు.
