అధికారికంగా సర్దార్ గౌతు లచ్చన్న జయంతి
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర స్థాయి జయింతి - మంత్రి సవిత

- 16న రాష్ట్ర వ్యాప్తంగా సర్దార్ జయంతి
- అణగారిన వర్గాల అభ్యున్నతికి గౌతు లచ్చన్న ఎనలేని సేవలు
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఈ నెల 16వ తేదీన ఆయన జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. అణగారిన వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహానీయుడు గౌతు లచ్చన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించినందుకు సీఎం చంద్రబాబుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. 1909 ఆగస్టు 16న ప్రస్తుత శ్రీకాకుళం జిల్లా సోంపేట తాలూకాలో బారువా గ్రామంలో ఒక సాధారణ గౌడ కుటుంబంలో గౌతు చిట్టయ్య, రాజమ్మ దంపతులకు 8వ సంతానంగా లచ్చన్న జన్మించారన్నారు. గౌతు లచ్చన్న పోరాట యోధుడే కాదు గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. అంటరానితనంపై అలుపెరగని పోరాటం చేశారని, హరిజన రక్షణ యాత్రలు నిర్వహించారని తెలిపారు. హరిజనులకు దేవాలయాల ప్రవేశాలు చేయించారన్నారు. బడుగు, బలహీన వర్గాల్లో విద్యావ్యాప్తికి రాత్రి బడులు నిర్వహించారన్నారు. జమిందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున్న పోరాటం చేసిన యోధుడు గౌతు లచ్చన్న అని వెల్లడించారు. మహాత్మా గాంధీ పిలుపు మేరకు తన 21వ ఏటా గౌతు లచ్చన్న స్వాతంత్ర్యోద్యమంలోకి దూకారన్నారు. ఎన్నో పర్యాయాలు జైలుకెళ్లారన్నారు. 1952లో సోంపేట నియోజకవర్గం నుంచి గెలుపొంది గౌతు లచ్చన్న మద్రాసు రాష్ట్ర శాసనసభలో తొలిసారిగా అడుగు పెట్టారన్నారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటులో గౌతు లచ్చన్న కీలక పాత్ర పోషించారన్నారు. టంగుటూరు ప్రకాశం పంతులు, బెజవాడ గోపాలరెడ్డి మంత్రివర్గంలో లచ్చన్న మంత్రిగా పనిచేసిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు. పభ్లిక్ అక్కౌంట్స్ ఛైర్మన్ గా కూడా పనిచేసిన గౌతు లచ్చన్న తరవాత అన్ని రాజకీయ పార్టీలతో తెగతెంపులు చేసుకుని, బడుగు వర్గాల సంక్షేమానికి కృషి చేస్తూ వచ్చారన్నారు. గౌతు లచ్చన్న 2006 ఏప్రిల్ 19 న కన్ను మూశారనన్నారు. కార్యదక్షత, ఉక్కు సంకల్పం వల్లే గౌతు లచ్చన్నకు సర్దార్ అని బిరుదు వచ్చిందన్నారు. దేశంలో సర్దార్ గా సర్దార్ వల్లభాయి పటేల్ కు, గౌతు లచ్చన్న మాత్రమే పేరుగాంచారన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని సేవలు చేసిన సర్దార్ గౌతు లచ్చన్న జయంతిని అధికారికంగా నిర్వహించడం ఎంతో ఆనందం కలిగిస్తోందన్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు మంత్రి సవిత ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 16న ఆయన జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు.
