స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కోట్లాది మంది వీరులను గుర్తు చేసుకోవాలి

దేశాన్ని ముక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీనే అని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన జెండావందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవ్‌ మాట్లాడుతూ దేహం ముక్కలైనా దేశాన్ని మాత్రం ముక్కలు కానివ్వమనేది బీజేపీ నినాదమని గుర్తు చేశారు. మత ప్రాతిపదికన దేశం విడిపోవడం బాధాకరమని, మతం ఆధారంగా దేశ విభజన జరగడం సరికాదనేది బిజెపి విధానమని మాధవ్‌ స్పష్టం చేశారు. లక్షలాది మంది త్యాగ ఫలంతో మనకు స్వాతంత్ర్యం వచ్చిందని, ఈ సందర్భంగా స్వాతంత్ర్యం కోసం బలిదానాలు చేసిన వారినందరినీ స్మరించుకోవాలన్నారు. స్వతంత్ర్య పోరాటంలో కొంత మందికి మాత్రమే పేరు వచ్చినా కోట్లాది మంది పోరాటం ఈ స్వాతంత్ర్య దినోత్సవం రోజు గుర్తు చేసుకోవాలని చెప్పారు. మన రాష్ట్రానికి చెందిన పింగళి వెంకయ్య వంటి వారు జాతీయ జెండా రూపకల్పనకు ఎంతో కృషి చేశారని తెలిపారు. మన దేశం కోసం పోరాటం చేసిన వారి ఇళ్ళకు వెళ్లి వారిని గౌరవించుకునే కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ స్వీకారం చుట్టారన్నారు. స్వట్జర్లండ్‌లో ఉన్న శ్యాంజీ కృష్ణవర్మ చితాభస్మాన్ని మన దేశానికి తీసుకువచ్చి సమర్మతి నదిలో కలిపి శ్యాజీవర్మ చివరి కోరికను తీర్చడం ద్వారా ప్రధాని నరేంద్రమోడీ ఆయనకు ఘన నివాళులు అర్పించారన్నారు.

ఎమర్జెన్సీ రోజుల్లో బిజెపి అనుబంధ సంస్థలు ఎన్నో పోరాటాలు చేశాయని మరో స్వాతంత్ర్య పోరాటం చేసి మన రాజ్యాంగాన్ని కాపాడుకున్నామన్నారు. స్వతంత్ర భారతావనిలో కూడా జాతీయ వాద సంస్థలు పోరాటాలు చేసే పరిస్ధితి వచ్చిందన్నారు. సేవ్ కాశ్మీర్, సేవ్ అస్సాం, సేవ్ తిన్ బిగా ఉద్యమాలు చేసింది బిజెపి మాత్రమే అన్నారు. 2014 నుంచి అధికారంలో ఉన్న మనం వల్లభాయ్ పటేల్ సేవలను గుర్తు చేస్తూ భారీ విగ్రహం ఏర్పాటు చేశామన్నారు. హర్ ఘర్ తిరంగా పేరుతో ప్రతి ఒక్కరిలో జాతీయ భావాన్ని పెంపొందించామని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రవాద దాడులకు తగిన బుద్ధి చెప్పామని ఆ ఆపరేషన్ తరువాత నాలుగో అతిపెద్ద శక్తి గా మన దేశం అవతరించిందని మాధవ్‌ వెల్లడించారు. ఆర్ధికాభివృద్ధి లొ కూడా ప్రపంచంలో మూడో స్థానానికి చేరుతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశం కోసం అందరూ పునరంకితం‌ కావాలని పిలుపునిచ్చారు.

Updated On 15 Aug 2025 1:35 PM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story