Meghana: మాజీ మంత్రి జోగి రమేశ్‌ తనపై చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా బాధ కలిగించాయని ఆయన కోడలు మేఘన ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కుటుంబ కలహాలపై వివరాలు వెల్లడించారు.

“జోగి రమేశ్‌ దంపతులనే సొంత అమ్మానాన్న అనుకున్నా. కానీ కొడుకు సమస్య ఏంటో తెలిసి కూడా మా అత్తగారు పెళ్లి చేశారు. ఆమె నాకు పెట్టింది గోరుముద్దలు కాదు.. విషపు ముద్దలు. నాకు గోరు ముద్దలు తినిపించారని జోగి రమేష్ చెప్పారు. నిజంగా ప్రేమ చూపిస్తే నాకు సమస్య వచ్చేది కాదు. భార్యాభర్తల సమస్యను పరిష్కరించకుండా వివాదం సృష్టించారు. అదనపు కట్నం తెస్తేనే నువ్వు హ్యాపీగా ఉంటావు అని మా అత్త అన్నారు” అని మేఘన చెప్పారు.

తన పుట్టింటి వారికి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదని, పూర్తిగా బిజినెస్‌ ఫ్యామిలీ అని ఆమె పేర్కొన్నారు. పెళ్లికి ముందు తాము హిందువులని చెప్పారని, పెళ్లి అయ్యాక తెలిసింది వారు క్రైస్తవులని వెల్లడించారు. “ఇంట్లో అసలు హిందువుల పూజలు జరిగేవి కావు. క్రైస్తవం పాటించడం తప్పు కాదు.. కానీ దాచి పెట్టి పెళ్లి చేయడం తప్పు. మా అత్తగారు హిందూ దేవుళ్లపై అభ్యంతరకరంగా మాట్లాడేవారు. జోగి రమేశ్‌ వాళ్ల ఇంట్లో అసలు పూజ గదే లేదు” అని ఆమె ఆరోపించారు.

నా దగ్గర ఉన్న ఆధారాలు అన్నీ పోలీసులకు అందజేశానని, ఎఫ్‌ఐఆర్‌లోని ప్రతి ఆరోపణకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని మేఘన చెప్పారు. “నన్ను ఏవిధంగా ఇబ్బందులకు గురిచేశారో బయటికి వచ్చిన వీడియోలు కొన్ని మాత్రమే. సరైన సమయంలో అన్నీ బయటపెడతా” అని హెచ్చరించారు.

న్యాయం కోసం మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ వద్దకు వెళ్లిన మాట వాస్తవమేనని, ఆయన మంచి సూచనలు చేశారని ఆమె తెలిపారు. సీపీ వద్దకు వెళితే కేసు పెట్టవద్దని మధ్యవర్తిత్వం జరిపారని, సజ్జల రామకృష్ణారెడ్డి వద్ద రాజీ చేసుకోవాలని సూచించారని పేర్కొన్నారు. “కాలయాపన తప్ప సమస్య పరిష్కరించేలా జోగి రమేశ్‌ ప్రవర్తించలేదు. వైఎస్‌ జగన్‌ను కూడా కలిసే ప్రయత్నం చేశాం.. కానీ కుదరలేదు” అని చెప్పారు.

పెళ్లయిన రెండు నెలలకే భర్త రాజీవ్‌ నల్‌ అండ్‌ వాయిడ్‌ కేసు వేశారని, ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిందని మేఘన వెల్లడించారు. “నన్ను వదిలించుకునేందుకు అనేక కట్టుకథలు చెప్పారు. కుమారుడికి ట్రీట్‌మెంట్‌ ఇప్పిస్తామని నన్ను పుట్టింటికి వెళ్లమన్నారు. మా తప్పు లేకుండానే ఏడాదిన్నరగా క్షోభ అనుభవిస్తున్నాం. నాకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తా” అని ఆమె స్పష్టం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story