చిల్లర దొంగలు మాత్రమే కాదు!

Opposition Leader Botsa Satyanarayana: కల్తీ నెయ్యి వ్యవహారంలో చిల్లర దొంగలను మాత్రమే కాదు, గజదొంగను కూడా పట్టుకోవాల్సిన అవసరం ఉందని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. తప్పు చేసినవారిపై చర్యలు తీసుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు. బుధవారం అసెంబ్లీలోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు.

'కల్తీ నెయ్యి విషయంలో చిల్లర దొంగలందరినీ ఎందుకు ఇబ్బంది పెట్టాలి? ఇక మొత్తంగా కొట్టేద్దామని ఆలోచించి, కేజీ నెయ్యి ధరను రూ.320 నుంచి రూ.658కి పెంచేశారా?' అని బొత్స ఆరోపించారు. ఇది ప్రజలపై భారం మోపేలా ఉందని విమర్శించారు. అంతేకాకుండా, అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైవీ సుబ్బారెడ్డి భార్య బైబిల్‌ పట్టుకున్నారంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. 'ఇలాంటి మాటలు విన్నప్పుడు ప్రపంచం ఎటు పోతోందో అనిపిస్తుంది. విజయమ్మ తన చేతిలోని బైబిల్‌ను ఇస్తే, సుబ్బారెడ్డి భార్య పట్టుకుని తిరిగి ఇచ్చేశారు. అది చూపించి ఆమె బైబిల్‌ పట్టుకున్నారని మాట్లాడటం సరికాదు. సుబ్బారెడ్డి భార్య పెద్ద భక్తురాలు. తిరుమలలోనూ, తమ ఇంట్లోనూ ఆమె ఎప్పుడూ పూజలు చేస్తుంటారు' అని బొత్స వివరించారు.

కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్‌ ఛైర్మన్‌ దినేష్‌కుమార్‌ బుధవారం ముఖ్యమంత్రిని కలవడం గురించి విలేకరులు ప్రశ్నించగా, 'ఆయన మర్యాదపూర్వకంగా సీఎంను కలిసి ఉంటారు. ప్రభుత్వ ఆసక్తి ఏమిటో సీఎం ఆయనకు చెప్పి ఉంటారు' అని బొత్స సమాధానమిచ్చారు. ఈ వ్యవహారంలో పారదర్శకత అవసరమని, పెద్ద దొంగలను కనుగొని చర్యలు తీసుకోవాలని ఆయన పునరుద్ఘాటించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story