పారదర్శకతకు ఓటీపీ విధానం: మంత్రి పయ్యావుల కేశవ్

Minister Payyavula Keshav: రాష్ట్రంలో గ్యాస్ సరఫరా వ్యవస్థను సాఫీగా నడపడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు అధికారులతో సమావేశమై, గ్యాస్ సరఫరా విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారిస్తోందని మంత్రి వివరించారు. పైప్‌లైన్ గ్యాస్ కంపెనీలతోనూ త్వరలో సమావేశమవుతామని చెప్పారు.

గ్యాస్ సిలిండర్ల బుకింగ్ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే జరగాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని మంత్రి పయ్యావుల తెలిపారు. సిలిండర్ డెలివరీ సమయంలో ఓటీపీ (OTP) ధృవీకరణ తప్పనిసరి చేశామని వెల్లడించారు. ఇది బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడానికి తీసుకున్న ముఖ్యమైన చర్య అని ఆయన అన్నారు.

“ప్రజలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నాం. అందరూ సహకరించాలి. ఆందోళన వల్ల కొందరు అధికంగా సిలిండర్లు బుక్ చేస్తున్నారు. కుటుంబ అవసరాలకు ఎలాంటి లోటు రాకుండా చేయడమే మా ప్రధాన లక్ష్యం. సిలిండర్ బుకింగ్ ఆన్‌లైన్‌లోనే ఉండాలి. డెలివరీకి ఓటీపీ ఉంటేనే సిలిండర్ అందిస్తారు. బ్లాక్ మార్కెటింగ్‌కు అవకాశం ఇవ్వకుండా ఈ పద్ధతిని అమలు చేస్తున్నాం. ఎవరైనా బ్లాక్ మార్కెటింగ్‌లో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటాం” అని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు.

ఈ చర్యలతో గ్యాస్ సరఫరా పారదర్శకంగా, సమర్థవంతంగా జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story