డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Deputy CM Pawan Kalyan: తిరుమల లడ్డూ తయారీలో నెయ్యి కల్తీ వ్యవహారంలో దోషులను ఎంతమాత్రం వదిలిపెట్టబోమని ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వైకాపా హయాంలో జరిగిన ఈ అపచారాన్ని క్షమాపణ చెప్పకుండా, తమపైనే దాడులు చేస్తున్న వైఖరిని తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో కూటమి నేతల కీలక సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

"లడ్డూ తయారీలో నెయ్యి వాడలేదని అన్ని నివేదికల్లో స్పష్టంగా తేలింది. ఏ నివేదికలోనూ వైకాపా నేతలకు క్లీన్‌చిట్ ఇవ్వలేదు. ఫిష్ ఆయిల్, పందికొవ్వు వంటివి ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. అడ్డగోలుగా మాట్లాడితే సరిపోతుందా? వాస్తవాలు చూసుకోరా?" అని పవన్ ప్రశ్నించారు.

తాను, ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉంటామని, గతంలో ఎన్‌డీడీబీ నివేదికను సీఎం తమకు చదివి వినిపించారని గుర్తుచేశారు. "జంతుకొవ్వు కలిసిందని చెప్పడం సున్నితమైన అంశం. ప్రజలు మాకు ఐదేళ్ల అవకాశం ఇచ్చినప్పుడు, అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే అసత్యాలు చెబుతామా? కళ్లముందు ఆధారాలు ఉన్నప్పుడు మాట్లాడకపోతే ఎలా?" అని అన్నారు.

వ్యక్తులు, వర్గాలపై కక్షలుంటాయని, కానీ వైకాపా నేతలు భగవంతుడిపైనే పగపెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఎట్టి పరిస్థితుల్లోనూ దోషులను వదిలిపెట్టం. ఇది ఇక్కడితో ఆగదు. ఏడుకొండలవాడికి వైకాపా నేతలు క్షమాపణ చెప్పాలి. భగవంతుడి ముందు వారు మోకరిల్లే వరకు మా యుద్ధం కొనసాగుతుంది" అని పవన్ కల్యాణ్ ఘాటుగా అన్నారు.

ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు దిగజారాయని విమర్శించారు. "పాలసేకరణ చేయని డెయిరీ నెయ్యి ఎలా పంపిణీ చేస్తుంది? రూ.320కే నెయ్యి వచ్చే పరిస్థితి ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారు. అన్యమతస్థుల ప్రాబల్యంతో ఓటు బ్యాంకు పెంచుకోవాలనేది వారి లక్ష్యం. నిబంధనలు పాటించకుండా లడ్డూ ప్రసాద పవిత్రతను తగ్గించారు" అని మాధవ్ ఆరోపించారు.

ఈ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని, భక్తుల మనోభావాలను రక్షించడంలో తమ నిబద్ధతను పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story